పురాతన ఆలయాలకు ‘శ్రీవాణి’ వైభవం | 176 Ancient Temples Restoration | Sakshi
Sakshi News home page

పురాతన ఆలయాలకు ‘శ్రీవాణి’ వైభవం

Sep 4 2023 4:12 AM | Updated on Sep 4 2023 7:37 AM

176  Ancient Temples Restoration - Sakshi

తిరుమల: పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూ­తన ఆలయాల నిర్మాణం, హిందూ ధార్మిక ప్రచార, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్టు ముందుకు దూసుకుపోతోంది. భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు శ్రీవాణి ట్రస్ట్‌  నిధులతో 176 పురాతన ఆలయాలను పునరుద్ధరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 2,273 నూతన  ఆల­యా­లు నిర్మించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలను  నిర్వహిస్తున్నారు. 

2019లో ట్రస్ట్‌ విధివిధానాలు ఖరారు: 
నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించింది. 2018 ఆగస్టు 18వ తేదీనే ట్రస్ట్‌ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించినా విధివిధానాలు మాత్రం 2019 సెపె్టంబర్‌ 23వ తేదీ ఖరారు చేశారు. అప్పటి వరకు కూడా టీటీడీ ట్రస్ట్‌లకు సంబంధించి లక్ష రూపాయలపైగా ఇచ్చిన దాతలకు మాత్రమే దర్శన సౌలభ్యం కల్పించేది. మొదటిసారి రూ.10 వేలను శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంగా అందించిన భక్తులకు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రోటోకాల్‌ బ్రేక్‌ దర్శన సౌకర్యం కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. 

ప్రోటోకాల్‌ బ్రేక్‌ దర్శనంతో ఆదరణ: 
వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన రావడానికి ప్రధాన కారణం విధివిధానాలే. అప్పటి వరకు కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు భక్తులు సిఫార్సు లేఖలు ద్వారా పొందడం లేదా అధిక మొత్తాన్ని దళారులకు చెల్లించి టికెట్లను పొందేవారు. శ్రీవాణి ట్రస్ట్‌ ప్రారంభంతో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ట్రస్ట్‌కు రూ.10 వేలు చెల్లిస్తే చాలు ప్రోటోకాల్‌ బ్రేక్‌ దర్శనం పొందే సౌలభ్యం టీటీడీ కల్పించింది.

భక్తులు మరో మాటకు తావివ్వకుండా శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఒక దశలో రోజుకు 2,700 మంది భక్తులు కూడా విరాళాలు అందించడం విశేషం. అంత మందికి ప్రోటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శనాలంటే ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది.

దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ వాటిని రోజుకు వెయ్యికి మాత్రమే పరిమితం చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు 500 చొప్పున విడుదల చేస్తుండగా, ఆఫ్‌లైన్‌ విధానంలో 400 టికెట్లు కేటాయిస్తున్నారు. మరో 100 టికెట్లను ఆఫ్‌లైన్‌ విధానంలోనే తిరుపతి విమానాశ్రయంలో కేటాయిస్తున్నారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు నెలకు అందే విరాళాలు రూ.30 కోట్లకు పరిమితమవుతుంది. 


నాలుగేళ్ల కాలంలో శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ. వెయ్యి కోట్లకు చేరుకున్నాయి. 
 2019లో రెండు నెలల కాలంలోనే 19,737 మంది భక్తుల నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.26.25 కోట్లు విరాళం లభించింది. 
 2020లో 49,282 మంది భక్తులు రూ.70.21 కోట్లను విరాళంగా అందించారు. 
♦ 2021లో లక్షా 31వేల మంది భక్తులు రూ.176 కోట్లు విరాళంగా అందించారు. 
 2022లో అయితే ఏకంగా 2 లక్షల 70 వేల మంది భక్తులు రూ.282.64 కోట్లు విరాళంగా అందించారు. 
2023లో ఇప్పటి వరకు లక్ష 58 వేల మంది భక్తులు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement