
ఈనెల 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆగ్రహంతో కదలిక
అడ్వాన్స్‌గా ఇచ్చిన నిధుల్లో రూ.2,177.47 కోట్లు దారిమల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఎన్‌ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో రూ.1,100 కోట్లను బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. దీంతో సేకరించిన భూమికి పరిహారం, నిర్వాసితులకు నగదు పరిహారం చెల్లించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన అడ్వాన్సు నిధుల్లో ఇప్పటికీ రూ.1,077.47 కోట్లను ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమచేయకుండా, దారిమల్లించడం గమనార్హం.
41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వచేసేలా పోలవరం ప్రాజెక్టును 2027, మార్చికల్లా పూర్తిచేయాలని కేంద్ర కేబినెట్ గతేడాది ఆగస్టు 28న తీర్మానించింది. అందుకు అవసరమైన రూ.12,157.53 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. అడ్వాన్స్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులివ్వడం ద్వారా నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు 9న పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లు, ఈ ఏడాది మార్చి 12న రూ.2,704.81 కోట్లు వెరసి రూ.5,052.81 కోట్లను విడుదల చేసింది.
వాటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమచేసి.. పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే ఖర్చుచేసి, యూసీలు పంపితే మళ్లీ అడ్వాన్సు నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే 2025–26 బడ్జెట్‌లో రూ.5,936 కోట్లు కేంద్రం కేటాయించింది. కానీ, కేంద్రం ఇచ్చిన అడ్వాన్సు నిధుల్లో రూ.2,177.47 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమచేయకుండా ఇతర అవసరాలకు మళ్లించింది.
రాష్ట్ర అధికారులపై కేంద్ర మంత్రి ఫైర్..
పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు నగదు పరిహారం, చేసిన పనులకు సంబంధించి రూ.1,300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే అంశాన్ని ఈనెల 6న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి రఘువారం ప్రస్తావించారు. అడ్వాన్సుగా ఇచ్చిన నిధులు మళ్లిస్తే ప్రాజెక్టు పూర్తయ్యేదెన్నడూ అంటూ పాటిల్ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులపై మండిపడ్డారు.
తక్షణమే అడ్వాన్సు నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమచేసి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఆదేశించారు. అడ్వాన్సుగా ఇచ్చిన నిధులు పూర్తిగా ఖర్చుచేసి.. యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు)లు పంపితేనే ప్రస్తుత బడ్జెట్‌లో పోలవరానికి కేటాయించిన నిధులను విడుదల చేస్తామని ఆయన స్పష్టంచేశారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మళ్లించిన అడ్వాన్సు నిధులు రూ.2,177.47 కోట్లలో రూ.1,100 కోట్లను ఇప్పుడు ఎస్‌ఎస్‌ఏ ఖాతాలో జమచేసింది. మిగిలిన రూ.1,077.47 కోట్లను ఇంకెప్పుడు జమచేస్తుందో!?