శభాష్‌ రమ్య.. నీ ప్రాజెక్ట్‌ అదిరింది!

10th Class Students Made Biodegradable Cups Andhra Pradesh - Sakshi

సాక్షి,వీరఘట్టం(శ్రీకాకుళం): ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌.. ఏది కొన్నా ప్లాస్టిక్‌. అంతరించిపోదని తెలిసినా, కీడు చేస్తుందని ప్రచారం చేసినా జనం దీన్ని వదలడం లేదు. కారణం సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం. సరి గ్గా ఈ ఆలోచనే వీరఘట్టం కేజీబీవీ విద్యార్థి ప్రాజెక్టును జాతీయ స్థాయికి పంపించింది. ప్లాస్టిక్‌కు బదులు బయో డీగ్రేడబుల్‌ కప్పులు వాడవచ్చని విద్యార్థి చేసిన ప్రదర్శన ఆమెను దేశ రాజధానికి పంపిస్తోంది.

ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ వర్చువల్‌ ఎగ్జిబిషన్‌లో వీరఘట్టం కేజీబీవీ టెన్త్‌ విద్యార్థిని కె.రమ్య ప్రదర్శించిన గడ్డి కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయి సెమినార్‌కు ఎంపికైందని ఎస్‌ఓ రోజా తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సెమినార్‌లో తమ విద్యార్థి పాల్గొంటుందని, ఇది తమకు గర్వకారణమని ఆమె తెలి పారు. ప్రాజెక్టు రూపొందించడంలో సహకరించిన గైడ్‌ టీచర్లు ఎల్‌.సునీత, కె.స్నేహలత, జి.సృజనలను అభినందించారు. 

ఏంటీ ప్రత్యేకత..?  
జిల్లా నుంచి 223 ప్రాజెక్టులు పోటీ పడితే ఈ ప్రాజెక్టు ఒక్కటే జాతీయ స్థాయి వరకు వెళ్లగలిగింది. కేజీబీవీ విద్యార్థిని రమ్య రూపొందించిన ప్రాజెక్టు పేరు బయో డీగ్రేడబుల్‌ కప్స్‌(గడ్డితో తయారు చేసే కప్పులు). ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ప ర్యావరణం కలుషితమవుతోంది. ముఖ్యంగా సిటీల్లో పానీపూరీ బడ్డీల వద్ద వీటి వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ప్లాస్టిక్‌ కప్పుల బదులు బయోడీగ్రేడబుల్‌ కప్పులు వాడితే ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించవచ్చునని రమ్య తన ప్రాజెక్టులో స్పష్టంగా చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 

కప్పుల తయారీ ఇలా..  
విద్యార్థిని చెప్పిన వివరాల ప్రకారం.. ఈ బయోడీగ్రేడబుల్‌ కప్పులు కాలుష్య రహితం. వీటిని తయారు చేయడం చాలా సులభం. మనకు అందుబాటులో ఉండే ఎండుగడ్డిని కొంత తీసుకుని దాన్ని పౌడర్‌గా చేయాలి. ఈ పౌడర్‌ను తగినంత నీటిలో కలపి ఈ ద్రావణాన్ని ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. ద్రావణాన్ని వేడి చేశాక అందులో తగినంత కార్న్‌ఫ్లోర్, వెనిగర్‌ వేసి ముద్దగా తయారు చేయాలి. ఈ ముద్దను కప్పులుగా తయారు చేసి ఎండబెడితే బయోడీగ్రేడబుల్‌ కప్పులు తయారవుతాయి. ఈ కప్పుల్లో వేడి పదార్థాలు తిన్నా ఎలాంటి హాని ఉండదు. ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు.  

ఆనందంగా ఉంది 
నేను రూపొందించిన బయోడీగ్రేడబుల్‌ కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వ డం ఎంతో ఆనందంగా ఉంది. మా ఎస్‌ఓ మేడమ్, గైడ్‌ టీచర్ల సలహాలు, సూచనలతో ఈ ప్రాజెక్టు రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ కప్పులను సులువుగా తయారు చేసుకోవచ్చు. పానీపూరీ బడ్డీల వద్ద, మనం నిత్యం ఇంటిలో వాడే ప్లాస్టిక్‌ కప్పుల బదులు వీటిని వాడితే పర్యావరణాన్ని కాపాడినవాళ్లమవుతాం. ఢిల్లీలో త్వరలో జరిగే జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సెమినార్‌ పాల్గొనేందుకు మరింతగా సిద్ధమవుతున్నాను.            
 – కె.రమ్య,  పదో తరగతి విద్యార్థిని, కేజీబీవీ, వీరఘట్టం

చదవండి: ఇల వైకుంఠపురంలో..! ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top