అనంతపురం: తాడిపత్రిలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, అక్కడ ప్రజాస్వామ్యానికి పూర్తిగా పాతరేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఎస్పీ జగదీష్ ప్రేక్షకపాత్ర వల్లే అరాచక శక్తులు హింసాత్మక ఘటనలతో రెచ్చిపోతున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడటాన్ని ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమకు అడ్డు ఎవ్వరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు దాడులకు తెగబడుతున్నారన్నారు. రాష్ట్రమంతటా వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. తాడిపత్రిలో ఆంక్షలు విధించి అప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ నెల 26న తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
శాంతిభద్రతలు క్షీణించాయి
తాడిపత్రిలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ప్రోద్బలంతో టీడీపీ గూండాలు దాడులతో విరుచుకుపడుతున్నారన్నారు. అందులో భాగమే వైఎస్సార్‌సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం, ఆ తర్వాత ఆస్పత్రిపై రాళ్లు రువ్వడం అని అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చే లంచాలకు పోలీసులు మరిగారని, అందుకే శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. నేరాలకు పాల్పడటం, కౌంటర్ కేసులు పెట్టడం ప్రభాకర్‌రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ తీసేసి.. టీడీపీ చొక్కాలు వేసుకుంటే మంచిదని హితవు పలికారు. తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్, విచ్చలవిడిగా మట్కా, గంజాయి సాగుతోందని, ఇందులో పోలీసులకు, ప్రజాప్రతినిధులకు ఎంత వాటా ఉందో తేల్చాలన్నారు.
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
పచ్చ గూండాలు.. ఖాకీల తీరుతో తాడిపత్రిలో ప్రజాస్వామ్యం అపహాస్యమైపోయిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలపై పోలీసులను, కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో విపక్ష నాయకులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
రక్తంతో తడిచిన రెడ్‌బుక్
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అమల్లోకి తెచ్చిన ‘రెడ్‌బుక్’ వైఎస్సార్‌సీపీ నాయకుల రక్తంతో తడిచిపోతోందని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చిందించిన రక్తం సాక్షిగా నేరమయ రాజకీయాలను మూకుమ్మడిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. తక్షణమే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ‘పచ్చ’ గూండాల దాడులు ఆపాలన్నారు. అనంతరం తాడిపత్రిలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగులకుంట కేశవరెడ్డిని నాయకులు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు మీసాల రంగయ్య, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, అనంత చంద్రారెడ్డి, మాజీ మేయర్ వసీం, నాయకులు కేవీ రమణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, విద్యార్థి విభాగం నాయకులు మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, కై లాష్, ఖాదర్, వినీత్, రమేష్, ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రేక్షకపాత్రలో ఎస్పీ జగదీష్..
జేసీ ఇచ్చే లంచాలకు మరిగిన పోలీసులు
యథేచ్ఛగా టీడీపీ నేతల దాడులు, దాష్టీకాలు
వైఎస్సార్‌సీపీ నేత కేశవరెడ్డిపై దాడి బాధాకరం
రేపు తాడిపత్రిలో గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, సమన్వయకర్తలు


