నార్పల :మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాల్లో బుధవారం చిన్న సరిగెత్తు వైభవంగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాలనుంచి తరలి వచ్చిన భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుని, కుళ్లాయిస్వామికి చక్కెర చదివింపులు చేసుకుని అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుళ్లాయిస్వామి మొక్కు ఉన్న వారు భక్తిశ్రద్ధలతో ఫక్కీర్ మాల వేసుకున్నారు. ఈ ఫక్కీరు మాలధారులు చెప్పులు వేసుకోకుండా నియమ నిష్టలతో ఉంటారు. స్వామివారు జలధికి వెళ్లిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఫక్కీరు మాల తీసివేస్తారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.
11న జాతీయ లోక్ అదాలత్
అనంతపురం: జూలై 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లా కోర్టులో న్యాయమూర్తులతో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని కోర్టుల న్యాయమూర్తులతో కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. లోక్ అదాలత్ దృష్టికి తీసుకరావాల్సిన కేసుల గురించి తగు సూచనలను చేశారు. ఈ సందర్భంగా మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసులపై, ఆర్థిక సంస్థల ద్వారా దాఖలు చేసిన పిటిషన్ల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగపరచుకునే విధంగా తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు సత్యవాణి, ఎన్.సత్యశ్రీ, బబ్లునాయక్, సీఎన్ మూర్తి, టి.కేశవ తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్‌పై నిర్లక్ష్యం
కళ్యాణదుర్గం: ‘సర్’ ప్రక్రియకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ ట్రాకింగ్ డిజిటలైజేషన్‌లో బీఎల్‌ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లకు పంపిణీ చేసిన ఫారాలతో పోలిస్తే డిజిటలైజ్ చేసిన ఫారాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మొత్తం 2,20,643 ఫారాలు పంపిణీ చేయగా, బుధవారం నాటికి 6,294 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ చేయడం గమనార్హం. ఈ పనుల్లో కుందుర్పి, శెట్టూరు, కంబదూరు మండలాల బీఎల్వోలు నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.


