అనంతపురం అగ్రికల్చర్: రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ మందకొడిగా కొనసాగుతోంది. జిల్లాకు కేటాయించిన 56 వేల క్వింటాళ్లకు గాను ప్రస్తుతానికి 20 వేల క్వింటాళ్లు సేకరించి మండలాల్లో నిల్వ చేశారు. ఇంకా 36 వేల క్వింటాళ్లు సేకరించాల్సి ఉన్నా... విత్తన కొరత కారణంగా వంద శాతం సాధ్యమయ్యే పరిస్థితి లేదంటున్నారు. కాగా ప్రస్తుతానికి 33 వేల మంది రైతులు 29 వేల క్వింటాళ్లు అవసరమని ఆర్‌ఎస్‌కేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పంపిణీ ప్రారంభించి 10 రోజులు పూర్తయినా 223 ఆర్‌ఎస్‌కేల పరిధిలో 18 వేల మంది రైతులకు 17 వేల క్వింటాళ్లు మాత్రమే అందజేశారు. జిల్లాలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లలో అందుబాటులో ఉన్న విత్తనం ఇప్పటికే విత్తనశుద్ధి చేసి పంపారు. ప్రస్తుతం కర్ణాటక ప్రాంతం, జిల్లాలో ఉన్న మరికొన్ని మిల్లర్ల దగ్గర నుంచి అతికష్టమ్మీద సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. గతేడాది ఖరీఫ్, రబీకి సంబంధించి మిల్లర్లకు రూ.50 కోట్ల మేర బకాయిలు చెల్లించకపోవడం, కనీసం ప్రస్తుతం రైతులు చెల్లిస్తున్న నాన్‌సబ్సిడీ మొత్తం సర్దుబాటు చేసినా సరఫరా చేస్తామని చెబుతున్నా... ప్రభుత్వం నుంచి ఏపీ సీడ్స్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఈసారి విత్తన పంపిణీ అస్తవ్యస్తంగా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. పంపిణీ ఆలస్యమయ్యే కొద్దీ రైతులు విత్తనంపై అనాసక్తి ప్రదర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎలాగోలా పంపిణీ కార్యక్రమాన్ని ముగించే ఆలోచనలో అధికారులు ఉండటం గమనార్హం. డబ్బు కట్టిన రైతులు తమకు విత్తనం కావాలంటూ డిమాండ్ చేస్తున్నా సకాలంలో పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. అటు శ్రీసత్యసాయి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్కడడక్కడా రైతులు విత్తనం కోసం అధికారులను నిలదీస్తున్నారు.


