● ఫోర్జరీ సంతకాలతో రూ.30 లక్షల వరకు స్వాహా
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చేపట్టిన పనుల్లో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై మంగళగిరి నుంచి వచ్చిన ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్‌ఓ ధర్మరక్షిత్, ఎఫ్‌ఆర్‌ఓ శంకరయ్య బుధవారం తనిఖీలు నిర్వహించారు. గత ఐదేళ్లలో అభివృద్ధి పేరిట చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులపై స్థానిక రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడును అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్ల క్రితం ఇ.వెంకటేశ్వర్లు అనే ఫారెస్ట్ ఉద్యోగి మృతి చెందారు. అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాంసింగ్ వివిధ పనులు చేయించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి.. చనిపోయిన ఉద్యోగి వెంకటేశ్వర్లు సంతకాలను ఫోర్జరీ చేయించి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే విచారణ నిమిత్తం మంగళగిరి నుంచి విజిలెన్స్ అధికారులు వచ్చారని సమాచారం. అయితే రాంసింగ్ ప్రస్తుతం రిటైర్డ్ కాగా.. అప్పటి నుంచి పనిచేస్తున్న కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ జనార్దన్ అంతా తానై ఈ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ రేంజ్ పరిధిలో బొగ్గుల బట్టీల నిర్వాహకుల నుంచి ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఫారెస్ట్ ఫీల్డ్ వాచర్‌ల వేతనాల్లో సైతం అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు ‘నగరవనం’ నిర్మాణంలో సైతం అవినీతి జరిగినట్లు ఫిర్యాదులొచ్చాయి. దీంతో రెండురోజుల పాటు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. ఈ విషయంపై ప్రస్తుత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడును వివరణ కోరగా వార్షిక తనిఖీలో భాగంగానే విజిలెన్స్ అధికారులు వచ్చారన్నారు.


