శెట్టూరు: మండలంలోని ములకలేడు గ్రామంలో శ్రీ శివసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. రైతులకు నకిలీ ఎరువులు, పురుగు మందులు అంటకడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి వాసకీరాణి మాట్లాడుతూ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని మార్కెట్‌లోకి నకిలీ మందులు, ఎరువులను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారని, ఇలాంటివారితో అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. మందులు కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ పరిశీలించి అవి కంపెనీ ఎరువులా.. స్థానికంగా తయారు చేసి విక్రయిస్తున్నారా అనే విషయాలు తెలుసుకోవాలన్నారు. తప్పనిసరిగా రసీదులు పొందాలని సూచించారు.


