గుమ్మఘట్ట: అధికారం మాది. మేమేం చేసినా చెల్లుతుందనే ధీమాతో ప్రజాధనాన్ని టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. ఉపాధి పనులకు రానివారి పేర్లను మస్టర్లలో నమోదు చేసి కూలీల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. రాయదుర్గం మండలంలో 7,758 యాక్టివ్‌జాబ్ కార్డులుండగా అందులో 13,501 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 3,650 మంది కూలీలు పనులు చేస్తున్నారు. గుమ్మఘట్ట మండలంలో యాక్టివ్ జాబ్‌కార్డులు 8,835 ఉండగా ఇందులో 14,767 మంది కూలీలు వున్నారు. ప్రస్తుతం 4,300 మంది కూలీలు పనులకు వెళుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పనులకు రాకపోయినా వచ్చినట్లు..
గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లిలో టిప్పర్ డ్రైవర్ ఆర్.వన్నూరుస్వామి ఉపాధి పనులకు రాకపోయినా వచ్చినట్లు మస్టర్లలో నమోదు చేస్తున్నారు. ఇలాగే, రాయదుర్గంలో ఓ ఆర్‌ఎంపీ వద్ద పనిచేసే పవన్, జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో ఏజెన్సీ నిర్వాహకురాలిగా పనిచేసే చవిటి దాసప్పగారి జ్యోతి, రాయదుర్గంలో ఓ మెడికల్‌షాపులో పనిచేసే బుడేన్‌సాబ్‌తో పాటు ఆయన భార్య ఉపాధి పనులకు వెళ్లకపోయినా వెళ్లినట్లు చూపి దోచేస్తున్నారు.
● రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామంలో ఉపాధి కూలీల నుంచి వారానికి రూ. 100 ప్రకారం, చదం గ్రామంలో వారానికి రూ. 200 లెక్కన ఫీల్డ్ అసిస్టెంట్లు తీసుకుంటున్నారని ఆయా గ్రామాల కూలీలు ఆరోపిస్తున్నారు. గ్రామదట్ల గ్రామంలో రామాంజినేయులు, రాజేష్ తదితరులు పనులకు వెళ్లకపోయినా వెళ్లినట్లు మస్టర్‌లలో ఎక్కించి నిధులు స్వాహా చేస్తున్నారు. అలాగే, మలకాపురం గ్రామంలో శ్రీకాంత్, కావేరి, రామచంద్రాశెట్టి (రవిశెట్టి), శోభారాణి పనులకు వెళ్లినట్లుగా మస్టర్లలో రాసుకుని వేల రూపాయలు మింగేశారు. మల్లాపురం గ్రామంలో బోయ రాజశేఖర్, చామండి, దుగ్గేశ్, రాజేశ్వరి, బొమ్మయ్య, మమత, శ్రీరాం, తిప్పక్కతో పాటు 28 మంది పేర్లను మస్టర్లలో ఎక్కించి నిధులను మింగినట్లు తెలిసింది. ఈ విషయంపై రాయదుర్గం, గుమ్మఘట్ట ఏపీఓలు రవి, సురేష్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కుందుర్పి మండలంలో బరితెగింపు..
మస్టర్లలో మాయాజాలం
ఉపాధి సిబ్బందితో కలిసి
టీడీపీ నాయకుల అక్రమాలు
‘మామూలు’గా పోతున్న అధికారులు
మండిపడుతున్న ప్రజలు
కుందుర్పి: మండల వ్యాప్తంగా 13 గ్రామ పంచాయతీల్లో అధికార టీడీపీనాయకులు, ఉపాధి హామీ సిబ్బంది కలిసి కనికట్టు చేస్తున్నారు. వంకల్లో ఇసుకను అటు ఇటు పారబోసి మస్టర్లలో నమోదు చేసి బిల్లులు చేసుకుంటున్నారు. రోజూ లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు.ముఖ్యంగా తెనగల్లు, బసాపురం, బెస్తరప ల్లి, తూముకుంట, నిజవళ్లి, ఎర్రగుంట, కుందుర్పి గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు చెప్పిందే వేదంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది నాయకులు మరింత బరితెగించి తమ పొలాల్లో పాత ట్రెంచులు, ఫారంపాండ్లకు లక్షల్లో బోగస్ బిల్లులు చేయించుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు మండలంలో చాలా గ్రామాల్లో ఉపాధి పనులకు కేవలం అధికార పార్టీకి మద్దతు పలికే వారు మాత్రమే పనులకు వెళ్లాలనే నిబంధనలు పెట్టినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. కరిగానపల్లి, నిజవళ్లి, కుందుర్పి, తెనగల్లు తదితర గ్రామాల్లో కొంతమంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు పని కల్పించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఉపాధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు ‘మామూలు’గా పోతుండడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మండలవ్యాప్తంగా ఉపాధి పనుల్లో రూ. 10 లక్షల మేర అవినీతి జరిగితే ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీల్లో కేవలం రూ.70 వేల అవినీతి మాత్రమే జరిగినట్లు అధికారులు తేల్చడమేమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జ్ ఎంపీడీఓ లక్ష్మీశంకర్‌ను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో ఇటీవల జరిగిన ఉపాధి పనులను పరిశీలించి అవినీతి జరిగినట్లు తేలితే టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో రికవరీ చేయిస్తామని చెప్పారు.


