భగవంతుడా.. మా బిడ్డను అప్పుడే తీసుకెళ్లావా? | - | Sakshi
Sakshi News home page

భగవంతుడా.. మా బిడ్డను అప్పుడే తీసుకెళ్లావా?

Jun 25 2026 4:53 AM | Updated on Jun 25 2026 4:53 AM

బకెట్‌లో పడి రెండేళ్ల చిన్నారి మృతి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

రాప్తాడు రూరల్‌: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల చిన్నారి కళ్లముందే విగతజీవిగా కనిపించడంతో ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ‘అయ్యో భగవంతుడా.. మా బిడ్డను అప్పుడే తీసుకెళ్లావా..’ అంటూ తల్లి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట బీసీ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. కంబదూరు మండలం కొత్తపల్లికి చెందిన మధు, సంధ్య దంపతులు. మధు ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమారుడు, రెండేళ్ల కుమార్తె దాక్షాయణి ఉన్నారు. ఇటీవల సంధ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి కురుగుంట బీసీ కాలనీలో నివసిస్తున్న తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగా చిన్నారి దాక్షాయణి ఆడుకుంటూ బయటకు వెళ్లింది. ఇదే సమయంలో ఇంటి ఆరుబయట నీటితో నింపిన బకెట్‌ ఉండటంతో ఆడుకుంటూ అక్కడికి చేరిన చిన్నారి అందులోకి తొంగిచూసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అదుపు తప్పి బకెట్‌లో పడిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంత సేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లి, అమ్మమ్మతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనగా వెతకడం ప్రారంభించారు. బయటకు వచ్చి చూడగా బకెట్‌లో చిన్నారి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సర్వజన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లి సంధ్య విలపించిన తీరు హృదయ విదారకంగా మారింది. ‘ఇప్పుడే మాట్లాడడం నేర్చుకుంటోంది... మా వెంట తిరుగుతోంది... ఇంతలోనే మమ్మల్ని వదిలి ఎలా వెళ్లిపోయావు తల్లీ’ అంటూ కన్నీరుమున్నీరైంది. కుటుంబ సభ్యుల రోదనతో కాలనీ అంతా విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ ఘటనపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నీటితో ఉన్న బకెట్‌లో చిన్నారి పడితే బయటపడేందుకు ప్రయత్నిస్తూ కొట్టుమిట్టాడే అవకాశం ఉందని, అలాంటి సమయంలో బకెట్‌ కిందపడటం లేదా కదలడం సహజమని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

అనంతపురం ఎడ్యుకేషన్‌: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఉద్యోగ నియామకాలకు సంబంధించి విడుదల చేసిన తాత్కాలిక మెరిట్‌ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు ఆశాఖ సహాయ సంచాలకులు జి.అర్చన తెలిపారు. తాత్కాలిక మెరిట్‌ జాబితాను httpr://ananthapuramu.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు కలెక్టరేట్‌లోని రికార్డ్‌రూమ్‌ నోటీస్‌బోర్డులో ఉంచినట్లు వెల్లడించారు. అర్హతలు, మార్కులు, రిజర్వేషన్లు తదితర అంశాలపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఈనెల 30 సాయంత్రం 5.30 గంటలలోపు సంబంధిత ఆధారాలతో కార్యాలయ పనిదినాల్లో కలెక్టరేట్‌లోని రికార్డ్‌రూంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేసి నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు అర్చన వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్ర, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

యువకుడు ఆత్మహత్య

బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మండల కేంద్రానికి చెందిన ముష్టూరు శివ, హేమలత దంపతుల కుమారుడు లోకేశ్వరసాయి (24) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సుబ్బరాయుడు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement