అమరావతి జపం తప్ప పేదల సంక్షేమం పట్టదా? | - | Sakshi
Sakshi News home page

అమరావతి జపం తప్ప పేదల సంక్షేమం పట్టదా?

Jun 25 2026 4:53 AM | Updated on Jun 25 2026 4:53 AM

సీఎం తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపాటు

ఉరవకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి జపం తప్ప పేదల సంక్షేమం పట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. బుధవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతుల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమరావతి ముసుగులో వేల కోట్లు దోపిడీ చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రూపాయి విలువ పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కేంద్ర ప్రభుత్వం మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంత అభివృద్ధికే నిధులన్నీ ఖర్చు పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ ముఖ్య నేతలు చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి దయనీయంగా ఉందని, ఎరువులు, మందులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరుకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్‌, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శిలు రాజారెడ్డి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

‘ఆర్టీసీ ప్రైవేటీకరణను సహించం’

అనంతపురం క్రైం: ఆర్టీసీని ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నాలను సహించబోమని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. విద్యుత్‌ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేట్‌ సంస్థ పినాకిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అనంతపురం డిపోలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ ఉనికినే ప్రమాదంలోకి నెట్టే కుట్ర జరుగుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసే విద్యుత్‌ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలన్నారు. ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగించడం ప్రజా రవాణా రంగానికి, ఉద్యోగుల భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతుందన్నారు. డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఉద్యమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా నడిపించడం బాధాకరమన్నారు. మూసివేసిన డిపోలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా డిమాండ్లను సాధించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాస్కర్‌నాయుడు, పీఎస్‌ ఖాన్‌, డి.ఎన్‌.రెడ్డి, సూరిబాబు, వాసుదేవరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement