● ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నిలదీత
అనంతపురం అర్బన్: ‘‘జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్‌కు 270 అర్జీలను ఎస్సీ, ఎస్టీలు సమర్పించారు. నెలలు గడుస్తున్నా కనీసం వాటిపై విచారణ చేయలేదు. దాడులు, అత్యాచారాలు, అవమానాలకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఉద్యోగాలు కల్పించడంలోనూ, పరిహారం చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇలాగైతే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం ఎలా జరుగుతుంది’’ అంటూ అధికారులను ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నిలదీశారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఓ.ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎస్పీ పి.జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చిన్నపెద్దన్న, వెంకటేశులు, గడ్డం ముత్యాలప్ప, ముసలయ్య, తిరుపాలు, కృష్ణమూర్తి, వెంకటరమణ మాట్లాడుతూ గుత్తి పరిధిలోని రజాపురం అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలని కోరారు. నగర పరిధి లోని శ్రీనగర్ కాలనీలో అంబేడ్కర్ భవనం పాడైపోతోందని, అక్కడ లైబ్రరీ, స్టడీ సెంటర్ ఏరాటు చేయాలని పలుమార్లు అర్జీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాయదుర్గంలో ఎస్సీ, ఎస్టీ వార్డులకు రెండు నెలలుగా తాగునీరు అందడం లేదన్నారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రెండు వసతి గృహాలు మంజూరయ్యాయని, అందులో ఒక పాఠశాలకు సంబంధించి ప్రవేశాలు చేపడతామన్నారు. సమావేశంలో కమిటీ మెంబర్ సాంఘిక సంక్షేమ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహబూబ్‌బాషా, ఆర్‌డీఓ వసంతబాబు తదితరులు పాల్గొన్నారు.


