● సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో ఘోరం
యాడికి: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో కరెంట్ షాక్‌కు గురై మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని వెంటన్నపల్లిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి భర్త తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి, పాతమ్మ (64) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మంగళవారం రాత్రి పాతమ్మ తమ ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా స్విచ్ బోర్డు ప్లగ్ బాక్స్ నుంచి బయటకు వచ్చిన విద్యుత్ వైరు తగిలింది. దీంతో షాక్‌కు గురైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.పాతమ్మ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి భర్త దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విమలాశాంతి పురస్కారానికి కథా సంపుటాల ఆహ్వానం
అనంతపురం కల్చరల్: జాతీయ విమలాశాంతి పురస్కారానికి కథా సంపుటాలు ఆహ్వానిస్తున్నట్లు ప్రముఖ కథా, నవలా రచయిత డాక్టర్ శాంతినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. 2022 జూలై 1 నుంచి 2026 జూన్ 30 మధ్య కాలంలో ప్రచురితమైన కథా సంపుటాల నాలుగు కాపీలను ‘అడవాల శేషగిరి రాయుడు, సంగీతవాణి, 1–3–21, రిషితా స్కూల్ ఎదురుగా, మోతీలాల్ వీధి, శాంతినగర్, అనంతపురం’ చిరునామాకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9000484173 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


