ఎంటీఎస్‌ కౌన్సెలింగ్‌లో పారదర్శకత ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

ఎంటీఎస్‌ కౌన్సెలింగ్‌లో పారదర్శకత ఎక్కడ?

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: డీఎస్సీ–2008 ఎంటీఎస్‌ టీచర్ల బదిలీ కౌన్సిలింగ్‌లో తీవ్ర వివక్ష చోటుచేసుకుందని పలువురు ఉపాధ్యాయులు ఆరోపించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 14 మంది ఉపాధ్యాయులకు ఎలాంటి కౌన్సిలింగూ నిర్వహించకుండా వారు పనిచేస్తున్న పాఠశాలల్లోనే స్థానాలను యథాతథంగా కేటాయించారు. మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహించడం అన్యాయమని వాపోయారు. ఈ మేరకు మంగళవారం పలువురు ఎంటీఎస్‌ టీచర్లు కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఎంటీఎస్‌ టీచర్లు కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోయినా నిర్బంధంగా ప్రక్రియ పూర్తి చేశారని వాపోయారు. ఒకే కేడర్‌ ఉపాధ్యాయుల విషయంలో రెండు రకాల విధానాలు అమలు చేయడం ఏ నిబంధనల ప్రకారం జరిగిందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా గత ఏడాది జిల్లాలో దాదాపు 80 మంది క్లస్టర్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ఇప్పుడు తమకు కేటాయించిన పాఠశాలలను కూడా ఖాళీల జాబితాలో చూపించలేదన్నారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న పాఠశాలలను ఖాళీలుగా చూపించి ఎంపికకు అవకాశం కల్పించారని, కానీ అనంతపురం జిల్లాలో మాత్రం తాము పనిచేస్తున్న పాఠశాలలను పూర్తిగా మూసివేసి ఒక్క పోస్టును కూడా ఖాళీగా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీల జాబితా తయారీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహణ వరకు పారదర్శకత లోపించిందని ఆరోపించారు.

నమ్మించి.. ఉసూరుమనిపించిన ఎమ్మెల్సీ

డీఎస్సీ–1998 ఎంటీఎస్‌ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌ వ్యవహారం మంగళవారం అనంతపురంలోని సైన్స్‌ సెంటర్‌లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఖాళీలు బ్లాక్‌ చేశారని, అందుబాటులో ఉన్న పోస్టులను చూపడం లేదని ఆరోపిస్తూ ఎంటీఎస్‌ టీచర్లు సోమవారం జరగాల్సిన కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. తమ సమస్యలను ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందిస్తూ ‘ఎవరూ ఆందోళన చెందొద్దు.. నేనున్నా.. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తాను’ అంటూ హామీ ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఎంటీఎస్‌ టీచర్లలో కొత్త ఆశలు చిగురించాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, వందలాది మంది టీచర్లు కేంద్రానికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కూడా అక్కడికి వచ్చి టీచర్లు, విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. తాను విద్యాశాఖ కమిషనర్‌తో మాట్లాడతానని, అప్పటిదాకా కౌన్సెలింగ్‌ నిర్వహించవద్దని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. ఎమ్మెల్సీ నుంచి లేదా రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఏదైనా సానుకూల సమాచారం వస్తుందేమోనని టీచర్లు ఆశగా ఎదురుచూశారు. గంటలు గడిచిపోయాయి. సాయంత్రం వరకు ఎదురు చూసిన విద్యాశాఖ అధికారులు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ముందుగా ప్రకటించిన ఖాళీలతోనే కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

14 మందికి మినహాయింపు... మిగతావారికి కౌన్సెలింగ్‌

‘ప్రభుత్వ యాజమాన్య’ ఉపాధ్యాయుల స్థానాలు యథాతథం

మండిపడుతున్న 2008 డీఎస్సీ ఎంటీఎస్‌ టీచర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement