కుందుర్పి: సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని మూడు వారాలు అవుతున్నా నేటికీ అందకపోవడంతో బెస్తరపల్లి రైతులు ఆగ్రహించారు. మంగళవారం సచివాలయం, రైతు సేవ కేంద్రం వద్ద నిరసన తెలియజేశారు. సిబ్బందిని బయటకు పంపి తలుపులకు తాళం వేశారు. 175 మంది రైతులు విత్తనకాయల కోసం డబ్బు చెల్లించామన్నారు. తమ కు విత్తన కాయలు అందించేవరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు. వీరి ఆందోళనకు సీపీఐ నాయకులు బీకే గోపాల్ మద్దతు పలికారు. అనంతరం ఏఓ విజయ్‌కుమార్ జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలపడంతో వారు ఆందోళన విరమించారు.


