డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘ టన డి.హీరేహాళ్ మండలంలోని తిమ్మలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన గంగప్ప, వండ్రమ్మ దంపతులకు మల్లికార్జున (27) కుమారుడు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంవత్సరం క్రితం కర్ణాటక రాష్ట్రం తిమ్మలాపురం గ్రామానికి చెందిన అనుషతో మల్లికార్జునకు వివాహం కాగా, ఐదు రోజుల క్రితం వీరికి మగబిడ్డ పుట్టాడు. కొడుకును హాస్పిటల్‌లో చూసి ఇంటికి వచ్చిన మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి వండ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.
జంతలూరులో మరో యువకుడు
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జంతలూరు గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జంతలూరు గ్రామంలో కిష్టయ్య, ఓబులమ్మ కుమారుడు సాయి (26) ట్రాక్టర్‌లో కట్టెలు వేసుకుని వస్తుండగా స్కూల్ వద్ద కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో షాక్‌కు గురైన సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్యం బలహీనం
● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
ఉరవకొండ: బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో సీపీఐ మూడు రోజుల రాజకీయ–సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. తమిళనాడులో 70 లక్షల మంది, పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షలు, కేరళలో 9 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో మెజార్టీ కోసం ఎంపీలను కొనుగోలు చేశారని, ఇందుకు సీఎం రమేష్‌ను మధ్యవర్తిగా పెట్టి ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్లు ముట్టజెప్పారని ఆరోపించారు. సీఈసీని చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేవుడి పేరున కూడా దోపిడీ సాగిస్తున్నారన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో రూ. 5 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని, భక్తులు సమర్పించిన కేజీల కొద్దీ బంగారు, వెండిని మాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా చరిత్రలో అసమర్థ సీఎంగా చంద్రబాబు నిలిచారన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం అమలు చేయకుండా మోసగించారన్నారు. 76 ఏళ్ల వయసులో చంద్రబాబు యోగా చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారని, నారా లోకేష్‌కు మాత్రం యోగా నేర్పించవద్దని ఎద్దేవా చేశారు. బీజేపీ విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, రామకృష్ణ, పద్మావతి, పార్వతీప్రసాద్, నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల జాతీయ క్రికెట్ చాంపియన్‌షిప్ ప్రారంభం
అనంతపురం: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో సోమవారం దివ్యాంగుల జాతీయ క్రికెట్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రోహిత్ సైనీ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ప్రధాన కార్యదర్శి రఘు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, తెలంగాణ, కర్ణాటక జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ –హర్యానా, తెలంగాణ–ఢిల్లీ, గుజరాత్– కర్ణాటక, ఉత్తరప్రదేశ్– మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగినట్లు నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎస్. నాగరాజు తెలిపారు.


