అసలే తక్కువ వేతనాలు. ఉద్యోగ విరమణకు చేరువవుతూ.. అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం బదిలీల కౌన్సెలింగ్‌లో వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. కక్ష కట్టి జిల్లా సరిహద్దుకు బదిలీ చేస్తోంది. దయ చూపండని గోడు వెల్లబోసుకున్న మినిమం టైం స్కే | - | Sakshi
Sakshi News home page

అసలే తక్కువ వేతనాలు. ఉద్యోగ విరమణకు చేరువవుతూ.. అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం బదిలీల కౌన్సెలింగ్‌లో వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. కక్ష కట్టి జిల్లా సరిహద్దుకు బదిలీ చేస్తోంది. దయ చూపండని గోడు వెల్లబోసుకున్న మినిమం టైం స్కే

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: బదిలీల్లో గతేడాది ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా సొంత లేదా సమీప మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని 1998 ఎంటీఎస్‌ టీచర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2008, 1998 డీఎస్సీ ఎంటీఎస్‌ టీచర్లకు సోమవారం జిల్లా సైన్స్‌ సెంటర్‌లో బదిలీల కౌన్సెలింగ్‌ చేపట్టారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ 1998 ఎంటీఎస్‌ టీచర్లు కౌన్సెలింగ్‌ను సామూహికంగా బహిష్కరించారు. ముందుగా 2008 ఎంటీఎస్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 187 మందికి పూర్తి చేశారు. అనంతరం 1998 డీఎస్సీ ఎంటీఎస్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఖాళీలను చూసి కంగుతిన్న టీచర్లు.. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు.

ఈసారి గతం కంటే దూరం

‘ఎంటీఎస్‌ టీచర్లకు గత ప్రభుత్వం సొంత మండలాలు, పొరుగు మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాది జిల్లా, మండల కేంద్రాలు, సమీప ప్రాంతాల్లోని ఖాళీలను ఉద్దేశపూర్వకంగా బ్లాక్‌ చేసి ఎంటీఎస్‌ టీచర్లను సరిహద్దు మండలాలకు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. రిటైర్‌మెంట్‌ పోస్టులు, క్లస్టర్‌ పాఠశాలల ఖాళీలు ఎందుకు చూపించడం లేదు. గతేడాది దూర ప్రాంతాలకు పంపారు.. ఈసారి అంతకంటే దూరం విసిరేస్తున్నారు.. ఇంకా ఎంత దూరం పంపుతారు?’ అంటూ పలువురు ఎంటీఎస్‌ టీచర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమను వయసు మీద పడిన ఈ దశలో జిల్లా సరిహద్దు మండలాలకు తరలించడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని, కమిషనర్‌తో మాట్లాడామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీల విషయమై ప్రశ్నిస్తే విద్యాశాఖ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

బదిలీల కౌన్సెలింగ్‌ను 1998 ఎంటీఎస్‌ టీచర్ల సామూహిక బహిష్కరణ

చాలా పోస్టులు బ్లాక్‌ చేశారంటూ ఆగ్రహం

‘పోస్టులు ఊడతాయ్‌’ అంటూ అధికారుల బెదిరింపులు

తమ గోడు ఆలకించాలంటూ ఉపాధ్యాయుల నిరసన

ఈ సరిహద్దు నుంచి ఆ సరిహద్దుకు..

ప్రస్తుతం కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, రాయదుర్గం, గుమ్మఘట్ట ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు ఇప్పటికే రోజూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను పరిశీలిస్తే చాలామందిని మడకశిర, రొళ్ల, గుడిబండ, అగళి వంటి మరింత దూర ప్రాంతాలకు పంపించే పరిస్థితి తీసుకువస్తున్నారని వాపోయారు. ఈ సరిహద్దు నుంచి అ సరిహద్దుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ప్రస్తుతం పదవీ విరమణకు చేరువలో ఉన్నవారే. అలాంటి వారిని కుటుంబాలకు దూరంగా పంపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘1998 డీఎస్సీ ఎంటీఎస్‌ ఉపాధ్యాయుల కన్నీళ్లను ప్రభుత్వం తుడుస్తుందా..? లేక మరోసారి దూరప్రాంతాల బాటే చూపిస్తుందా..?’ అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ప్రభుత్వ నిబంధన మేరకే ఖాళీలను చూపించామని ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. తొలిరోజు 1998 ఎంటీఎస్‌ టీచర్లు హాజరుకాలేదు. మంగళవారం ఉదయం 10 గంటలకు వారికి కౌన్సెలింగ్‌ ఉంటుందని ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement