● వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకుల ధ్వజం
అనంతపురం అర్బన్: కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేశారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్ ధ్వజమెత్తారు. విద్యార్థుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం నగరంలోని సంగమేష్ సర్కిల్ నుంచి అర్ధనగ్న ప్రదర్శనతో కలెక్టరేట్ చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా సాకే చంద్రశేఖర్, చంద్రశేఖర్‌యాదవ్‌తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు విద్యాకానుక కింద నోట్ పుస్తకాలు, స్కూల్‌బ్యాగ్‌లు, యూనిఫాంలు, బూట్లు, సాక్సులు, బెల్టు, వర్క్‌బుక్‌లు, నిఘంటువులు అందించారన్నారు. క్రమం తప్పకుండా అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి.. తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. ఇక రెండో ఏడాది పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15వేల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికీ కలిపి తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పిన చంద్రబాబు.. రూ.2వేలు కోత పెట్టారన్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు తల్లికి వందనం సొమ్ము కానీ.. విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యాసామగ్రి కానీ అందించలేకపోయిందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ని శాఖల్లో వేలుపెడుతూ సొంత శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదంటూ ఎద్దేవా చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తూ పోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి నితిన్ కుమార్ రెడ్డి, నాయకులు దాదాఖలందర్, లోకనాథరెడ్డి, సూరి, మణికంఠ, అమర్‌నాథ్‌రెడ్డి, తలారి వినీత్, ఉదయ్, మైను, మసూద్, ప్రసాద్, హర్ష, రోహిత్, సుబ్బారావు, హరి, ఖాదర్, అబ్బాస్, ఓబులేసు, రాంభూపాల్, కోడూరు రాము, ఆర్య, హిద్దు, మోహన్‌నాయక్, ఆకాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇండ్ల విజయ్, నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మంజూనాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, హరీష్, సుందర్, చరణ్, గౌతమ్, బాబా ఇమ్రాన్, బబ్లూ, అక్షయ్, రఫీ, రాహుల్‌రెడ్డి, సాయి యాదవ్, తేజు, తదితరులు పాల్గొన్నారు.


