● మంత్రి పయ్యావుల ఇలాకాలో బరి తెగించిన టీడీపీ మద్దతుదారులు
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఆగడాలు శ్రుతిమించాయి. అధికారం ఉందన్న అహంకారంతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఉరవకొండలోని సీవీవీ నగర్‌కు చెందిన ఆదికేశవ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తను 15 మంది టీడీపీ మద్దతుదారులు ఆటోలో కిడ్నాప్ చేసి..హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఆదికేశవ చికెన్ షాపులో పనిచేస్తుంటాడు. ఈ నెల 12న ఉరవకొండలో పెద్దఎత్తున నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకుని నిరసన ర్యాలీలో పాల్గొనడంతో పాటు ఆ కార్యక్రమం విజయవంతమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీన్ని అదే కాలనీకి చెందిన కొంతమంది టీడీపీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. సోమవారం అనంతపురం బైపాస్‌లోని చికెన్ కబాబ్ సెంటర్ వద్ద ఉన్న ఆదికేశవను టీడీపీ మద్దతుదారులు ఆటోలో కిడ్నాప్ చే శారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. చేతి కడియంతో ముఖం మీద బాదడంతో ముఖం గుర్తుపట్టలేనంతగా మారింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆదికేశవను స్థానికులు గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై ఏఎస్‌ఐ శ్రీశైలం వివరాలు సేకరించారు. దాడి ఘటన గురించి తెలుసుకున్న వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, వైఎస్సార్‌పీపీ రాష్ట్ర నాయకులు బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, మండల కన్వీనర్ మూలగిరిపల్లి ఓబన్న, వేమన్న తదితరులు ఉరవకొండ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.


