ధర్మవరం: ఓటరు జాబితాలో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిర్వహిస్తున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో బీఎల్‌ఓలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ధర్మవరంలో బీఎల్‌ఓ (బూత్‌లెవల్ ఆఫీసర్)లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంటింటి సర్వేకు పూర్తిగా మంగళం పాడారు. అలాగే డోర్ నంబర్లు క్యాన్సిల్ అయిన ఇళ్ల అడ్రెస్‌లతో ఓట్లు ఎక్కించే విధంగా వ్యవహరిస్తున్నారు.
అందరినీ ఒకే చోటకు పిలిపి
17వ వార్డులోని 8వ సచివాలయ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటరు వెరిఫికేషన్ చేయాల్సిన బీఎల్‌ఓ లీలావతి... ఓటర్లను స్థానిక బీఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణకు రమ్మని చెబుతున్నారు. అక్కడే ఓటరు గణన ఫారాలు అందజేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఓటరు గణన దరఖాస్తులను అక్కడే పూర్తి చేస్తుండటంతో ప్రజలు నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా అయితే బీఎల్‌ఓ ఇంటింటికీ వెళ్లి ఓటర్లుకు దరఖాస్తులను అందించి... వారు నింపిన తర్వాత మళ్లీ వారి ఇంటి వద్దకే వెళ్లి స్వీకరించాల్సి ఉంది. ఇందుకుగాను ప్రభుత్వం వారికి టీఏ, డీఏలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తోంది. కానీ పట్టణంలో ఇష్టానుసారం చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.


