విత్తన కార్తెలు మొదలు | - | Sakshi
Sakshi News home page

విత్తన కార్తెలు మొదలు

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ విత్తుకు అదను మొదలైంది. ఆదివారంతో మృగశిర కార్తె ముగిసింది. సోమవారం నుంచి కీలకమైన ఆరుద్ర కార్తె మొదలవుతుంది. ఆరుద్రలో విత్తనం పడితే మంచి పంట దిగుబడులు వస్తాయని రైతుల్లో నమ్మకం. ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే ఆరుద్ర తర్వాత వచ్చే పునర్వసు కూడా విత్తుకునేందుకు మంచి అదనుగా చెబుతారు. వర్షాలు ఇంకా ఆలస్యమైతే ఆ తర్వాత వచ్చే పుష్యమి కూడా ఫరవాలేదంటున్నారు. మొత్తంగా ఆరుద్రతో పాటు పునర్వసు కార్తెలు పంటలు విత్తుకునేందుకు మంచి అదనుగా భావిస్తారు. ముంగారు వ్యవసాయ పనులు ప్రారంభించే ఏరువాక పౌర్ణమి కూడా ఆరుద్ర కార్తె మధ్యలో అంటే ఈనెల 29న రావడం విశేషం. జూలై 6న పునర్వసు, జూలై 20న పుష్యమి కార్తెలు వస్తాయి. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న, కొర్ర లాంటి ప్రధాన పంటల సాగుకు జూలై ఆఖరు వరకు వేసుకోవచ్చని, ఆగస్టు, సెప్టెంబర్‌లో ఉలవ, పెసర, అలసంద, మేత జొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని శాస్త్రవేత్తలు చెబుతారు.

ప్రభావం చూపని ‘నైరుతి’..

ఆశల ‘నైరుతి’ జూన్‌ 6న జిల్లాలోకి ప్రవేశించింది. మొదటి వారంలో రుతుపవనాలు కాస్తంత ప్రభావం చూపినా... ఈనెల 14 తర్వాత మొహం చాటేశాయి. ఈనెల 7న 12.5 మి.మీ, 9న 5.7 మి.మీ, 13న 16.9 మి.మీ, 14న 26.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడంతో రైతులు ముందస్తుగా కంది, ఆముదంతో పాటు కొంత వేరుశనగ... ఇలా అన్ని పంటలు ప్రస్తుతానికి 50 వేల హెక్టార్లలో సాగు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఖరీఫ్‌లో 3.43 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే కీలకమైన సమయంలో వరుణుడు మొహం చాటేస్తుండటం పంటల సాగుకు అవరోధంగా మారింది.

సాధారణం కన్నా తక్కువగానే..

జూన్‌ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా మొదటి 15 రోజుల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే 63.9 మి.మీ నమోదైంది. అయినా బొమ్మనహాళ్‌, వజ్రకరూరు, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, డీ.హీరేహాళ్‌, రాయదుర్గం, యాడికి, కళ్యాణదుర్గం, నార్పల తదితర 12 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా అంతటా ఏరువాక మందకొడిగా ‘సాగు’తోంది. ఈనెలలో 8 వర్షపు రోజులు (రెయినీడేస్‌) నమోదైనా జిల్లా అంతటా ఒక రోజు కూడా వర్షం కురవని పరిస్థితి నెలకొంది. ఎల్‌–నినో ప్రభావంతో వర్షాలు గతితప్పుతున్నట్లు అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విత్తనం, ఎరువుల కష్టాలు..

చంద్రబాబు ప్రభుత్వం రైతులకు రాయితీ విత్తన వేరుశనగ, కందులు, ఇతర విత్తనాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ పాటికి రైతులకు పూర్తిగా విత్తనం చేరాల్సివున్నా 20 శాతం మందికి కూడా వేరుశనగ, కందులు అందలేదు. యూరియా, డీఏపీ అమ్మకాలకు కొత్తగా యాప్‌ పెట్టి ఆంక్షలు విధించడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెంచేయడంతో పెట్టుబడి పెరిగి వ్యవ‘సాయం’ భారమైనట్లు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ గురించి పట్టించుకోకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. అరకొరగా ఇస్తున్న అన్నదాత సుఖీభవతోనే చేతులు దులుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

నేటి నుంచి విత్తనాలు విత్తుకునేందుకు శుభగడియలు

ఆరుద్రతో పాటు పునర్వసు, పుష్యమి కార్తెలు ఏరువాకకు అదను

ముందస్తు వర్షాలకు ఇప్పటికే

50 వేల హెక్టార్లలో పంటలు

అరకొర విత్తనాలు, ఎరువుల ఆంక్షల నడుమ ఇబ్బందుల్లో రైతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement