నార్పల: ముందు కష్టాలు దాటితేనే తర్వాత కుళ్లాయిస్వామి దర్శనం అన్నట్లుగా పరిస్థితి మారింది. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొహర్రం ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తుండగా, ఆలయ పరిసరాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడం భక్తులకు శాపంగా మారింది. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి రావడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు. భద్రతా సిబ్బంది తగినంత మంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో భక్తుల మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిద్రమత్తు వదిలి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
హుండీలు భద్రమేనా...?
గత ఏడాది ఉత్సవాల సందర్భంగా గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో ఒకటి గల్లంతవడం అప్పట్లో కలకలం రేపింది. భక్తులు సమర్పించిన కానుకలతో నిండిన హుండీ అనుమానాస్పద రీతిలో మాయమైపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై విచారణ నిమిత్తం దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ గూగూడుకు వచ్చిన సమయంలో ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌ల బ్యాకప్ లేదని స్థానిక సిబ్బంది తెలపడం, పలుమార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఈఓ శోభారాణి పాత్రపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో గూగూడు గ్రామస్తులు, కుళ్లాయిస్వామి భక్తుల్లో అనుమానాలు రేకెత్తాయి. మొహర్రంను పురస్కరించుకుని ఈ సారి ఆలయంలో నాలుగు హుండీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా హుండీలను భద్రంగా కాపాడాలని భక్తులు కోరుతున్నారు. గత ఏడాది హుండీ మాయమైన విషయంపై పొలీసులు, దేవదాయ శాఖ అధికారులను వివరణ కోరగా ఆర్‌డీఓ సమక్షంలో విచారణ జరిగిందని, ఖాళీ హుండీ అని తేలడంతో కేసు ముగించినట్లు తెలిపారు.


