అనంతపురం: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి.. ఆటవిక రాజ్యాన్ని అమలు చేస్తూ.. ఎవరు జీవించాలో..ఎవరు జీవించకూడదో.. నిర్ణయం తీసుకొని అందుకనుగుణంగా పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో సగటు మనిషి బతకడం కంటే చావే శరణ్యం అనే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలిస్తాం అనే నియంతృత్వపు ధోరణి పెచ్చుమీరుతోందన్నారు. అనంతపురం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ అధ్యక్షత వహించారు.
చంద్రబాబూ అంబేడ్కర్ భావజాలమే
గద్దె దింపుతుంది..
సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవించే హక్కును కల్పించిన ఆర్టికల్ 21 .. మృతదేహాన్ని సైతం గౌరవించాలని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించారు. అణగారిన వర్గాలు, పేదలు స్వేచ్ఛగా జీవించేలా ప్రసాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని అణిచి వేసే కుట్ర జరుగుతోందన్నారు. ఒక మనిషిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టి.. చంపేసి.. అనాథ శవంగా బూడిద చేసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించడానికే భయమేస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి..గాదె సాయికృష్ణ తల్లిదండ్రులను పరామర్శించకపోయినట్లయితే ఇప్పటి దాకా ఈ కేసుపై ప్రభుత్వం స్పందించే పరిస్థితి ఉండేది కాదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలమే గద్దె దింపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు సంఘటితమై ప్రస్తుత ప్రభుత్వ అకృత్యాలు, అన్యాయాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సాయికృష్ణ లాకప్‌డెత్, పేరుపోగు క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి దీటుగా ఎదుర్కోకపోతే స్వేచ్ఛగా జీవించే పరిస్థితే ఉండదని పేర్కొన్నారు. జూలై 5న అనంతపురం జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కేపీ నారాయణ స్వామి, విష్ణు నారాయణ, న్యాయవాదులు వాల్మీకి హరి, పోతులయ్య, విద్యార్థి నాయకులు చంద్రశేఖర్ యాదవ్, పాపిరెడ్డి పల్లి పృథ్వి, హేమంత్ కుమార్, మహేష్, కట్టుబడి తానీషా తదితరులు మాట్లాడారు.
అంబేడ్కర్ వ్యతిరేక భావజాలంతో అణగారిన వర్గాలపై దాడి
రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న
నియంతృత్వ ధోరణి
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని దీటుగా
ఎదుర్కొందాం
రౌండ్‌టేబుల్ సమావేశంలో
మాజీ మంత్రి సాకే శైలజానాథ్
జూలై 5న అనంతపురంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో బహిరంగ సభ


