అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఉంటుందని సీఎండీ శివశంకర్ లోతేటి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్: 8977716661లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలన్నారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ..
అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
పీఏబీఆర్ జలాశయంలో తగ్గిన నీటి మట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2.1 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు ఆదివారం తెలిపారు. డ్యాంలోకి ఇన్‌ప్లో లేదు. పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి, అనంత, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి, లీకేజీ రూపంలో మరో 75 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. అవుట్ ఫ్లో మాత్రమే ఉండడంతో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గిపోతోంది. నీటి మట్టం తక్కువున్నా తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ఇబ్బంది లేదని డ్యాం ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఆనవాయితీ పేరిట
చెట్లను అంతం చేయొద్దు
● జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహరం సందర్భంగా అగ్ని గుండాల ఏర్పాటు చేసే ఆనవాయితీ పేరిట చెట్లను నరికి గుండాల్లో పడేయొద్దని ఉమ్మడి జిల్లాల అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) చక్రపాణి సూచించారు. ఆదివారం ఆయన అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో పీర్ల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని, పీర్ల చావిడి ఎదుట అగ్నిగుండంలో పెద్ద ఎత్తున చెట్లు నరికి, మొద్దులు వేసి అంటించడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇటీవల కురిసిన గాలివానకు చాలాచోట్ల పెద్ద చెట్లు పడిపోయాయని, అలాంటివి గుండంలోకి వేయాలన్నారు. లేదా విచ్చలవిడిగా కంపచెట్లు పెరిగాయని, వాటిని వాడుకోవాలని డీఎఫ్‌ఓ తెలిపారు. ఎవరికై నా అగ్నిగుండంలో వేసేందుకు ఎండిన కట్టెలు, వంట చెరకు కావాల్సి వస్తే అటవీ సిబ్బందిని సంప్రదిస్తే సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రజల అవగాహన కల్పిస్తున్నాం..
ఎఫ్‌ఆర్‌ఓ శివరాం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పచ్చని పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా రేంజి పరిధిలోని కూడేరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల, నార్పల తదితర మండలాల పరిధిలో ’చెట్లను నాటుదాం– పర్యావరణాన్ని కాపాడుకుందాం’ నినాదంతో ప్రజలకు ర్యాలీలు, జీపుజాతా, సదస్సులు, బీట్ కమిటీల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొహర్రం పండుగకు పచ్చని చెట్లను నరికకుండా ఎండిన వాటిని వినియోగించాలన్నారు.
రేబిస్ వ్యాక్సిన్ లేదట!
బొమ్మనహాళ్: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఆదివారం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మండలంలోని ఉంతకల్లుకు చెందిన ప్రతిభ అనే చిన్నారిని కుక్క కరవడంతో ఆమె తండ్రి వ్యాక్సిన్ వేయించేందుకు బొమ్మనహాళ్ పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. సిబ్బంది వద్దకు వెళ్లి చిన్నారి తండ్రి విషయం చెప్పాడు. ఇక్కడ కుక్కకాటుకు మందు లేదని సమాధానం చెప్పారు. దీంతో చిన్నారి తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉండగా, పీహెచ్‌సీ డీడీఓ డాక్టర్ శ్రావణ్‌కుమార్ చొరవ తీసుకొని శ్రీధరఘట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కుక్క కాటు వ్యాక్సిన్ తెప్పించి, చిన్నారికి వేయించారు.
చిరుత కలకలం
కళ్యాణదుర్గం రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని రాయదుర్గం రోడ్డు సమీపంలో ఆదివారం చిరుత స్థానికులకు తారస పడింది. దీంతో చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో చిరుత పక్కనే ఉన్న కొండల్లోకి పరుగుతీసింది.


