కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో శనివారం రాత్రి వరుస దొంగతనాలు జరిగాయి. స్థానిక జయనగర్ కాలనీలోని సుధాకర్ ఇంటి తాళం ధ్వంసం చేసి, లోపలికి ప్రవేశించి బీరువాలోని పది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే ఇంట్లో మరో గదిలో ఉన్న లాకర్ తెరిచేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. అదే కాలనీల్లో మరో ఇంట్లో దొపిడీకి యత్నించారు. ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇంట్లో ఎలాంటి నగదు దొరక్క వెళ్లిపోయారు. ఉదయం ఇంటి యజమానులు ఇంటితాళాలు తెరిచి ఉండటతో దొంగతనం జరిగినట్లు భావించి పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో పశువుల దొంగలు
ఉరవకొండ: ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగలు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండలంలోని వై.రాంపురం గ్రామానికి చెందిన కొందరు రాత్రి సమయాల్లో గ్రామాల్లో పశువులను ఎత్తుకెళ్లి, వాటిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారంతో దొంగలను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గుమ్మఘట్ట: మండలంలోని గౌనికుంట గ్రామానికి చెందిన గంగమ్మ (60) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గంగమ్మకు హనుమక్క, బొమ్మక్క సంతానం. వీరికి వివాహాలు అయ్యాయి. అత్తంటిట్లోనే అల్లుళ్లు కూడా ఉంటున్నారు. గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆదివారం అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆమెను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా, మార్గంమధ్యలో మృతి చెందింది. కాగా, గంగమ్మ మృతిపై కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో నుంచి జారిపడి వ్యక్తి మృతి
పెద్దవడుగూరు : మండలంలోని గుత్తి అనంతపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆటో నుంచి జారిపడి సాకే శ్రీనివాసులు (36) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలోని అక్షయ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆటోలో ప్యాపిలి వెళ్లి తిరిగి వస్తుండగా షుగర్ అధికమై, కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక వస్తున్న గుర్తు తెలియని వాహనం అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉనానరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● కుమారుడిని నీట్ పరీక్షకు తీసుకెళ్లి తిరిగొస్తుండగా ఘటన
తాడిపత్రి రూరల్ : చుక్కలూరు క్రాస్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వనాథ్ (45) మృతి చెందాడు. అప్‌గ్రెడ్‌సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్ విజయబార్ అండ్ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. గుత్తిలో కుమారుడు శ్రీనాథ్‌ను ద్విచక్రవాహనంపై నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లాడు. పరీక్ష రాయించుకొని తిరిగి వస్తుండగా, మార్గంమధ్యలో స్నేహితుడి కారులో కుమారున్ని ఎక్కించాడు. ద్విచక్రవాహనంపై వస్తున్న విశ్వనాథ్‌ను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


