బొమ్మనహాళ్: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం అంజన్న ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గర్భాలయ నిర్మాణం నేపథ్యంలో మూలవిరాట్ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. ఆలయ ప్రాంగణంలోని భోజన శాలలో బాలాలయాన్ని నిర్మించి ఆంజనేయస్వామి ప్రతిమను ప్రతిష్టింపజేశారు. శనివారం వరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ నరసింహారెడ్డి, ధర్మకర్త శ్రీనాథ్ ఆధ్వర్యంలో బాలాలయంలో స్వామిని ప్రతిష్టించి ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంజన్న ప్రతిష్టాపన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రామంజనేయులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎంసీహెచ్ రాజ్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పరమేష్, నాయకులు కోటేశ్వరరెడ్డి, కలేకుర్తి జయరామ్‌రెడ్డి, హంపారెడ్డి, లక్ష్మీనారాయణ, ఫొటో బసవరాజు, బడిగే వన్నూరుస్వామి, అంజి, సిద్దనగౌడ్, రామాంజనేయులు, నాగరాజు, జగన్ పాల్గొన్నారు.
కుక్ పోస్టుకు
దరఖాస్త్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న కుక్ పోస్టు– 1 భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న వారు http:// ananthapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని, భర్తీ చేసి, సంబంధిత సర్టిఫికెట్లను జరపరచాలన్నారు. ఈనెల 30లోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు అందించాలన్నారు.
సమర్థవంతంగా
సేవలు అందించాలి
అనంతపురం అర్బన్: రెవెన్యూ ఉద్యోగులు సేవలు సమర్థవంతంగా అందించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో రెవెన్యూడే నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జేసీ విష్ణుచరణ్‌కు డీఆర్‌ఓ మలోల, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్.దివాకర్‌రావు కేక్ తినిపించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు శాఖపై విశ్వనీయత పెంచాలన్నారు. అనంతరం జేసీని అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, పద్మావతి, పరిపాలనాధికారి అలెగ్జాండర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దివాకర్‌రావు, కోశాధికారి పునీత్‌బాబు, విభాగాల సూపరింటెంట్లు, తహసీల్దార్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అర్హులందరికీ
‘అన్నదాత సుఖీభవ’
విడపనకల్లు: అర్హత ఉన్న ప్రతి రైతుకూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం మండలంలోని వి.కొత్తకోటలో 2026–27 సంవత్సరం మొదటి విడతగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. పీఎం కిసాన్ 23వ విడత నిధులను వెస్ట్ బెంగాల్ తారకేశ్వర్ హుగ్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విడుదల చేస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల నుంచి విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా, మండల వ్యవసాయాధికారులు, తహసీల్దారు వెంకటరమణమ్మ, రైతులు పాల్గొన్నారు.


