అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల బదిలీల్లో 2008 డీఎస్సీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 22లోపు పూర్తి చేయనున్నారు. సీనియార్టీ జాబితా తయారీపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌లో పాల్గొ నని అభ్యర్థులు, అనధికారికంగా విధులకు గైర్హాజరైన, అనుమతించిన సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరని ఎంటీఎస్ టీచర్లు పునర్నియామకానికి అర్హులు కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎంటీఎస్ టీచర్ల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఏడాది మే 31 నాటికి ఉన్న స్పష్టమైన ఖాళీలను గుర్తించనున్నారు. 2026 జూన్ 20 నాటికి విద్యార్థుల నమోదు, ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) మేరకు ఖాళీలను కౌన్సెలింగ్‌లో ప్రదర్శించనున్నారు. ప్రాథమిక/ ఫౌండేషనల్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 18 మాత్రమే ఉండి, రెండు ఎస్జీటీ పోస్టులు మంజూరై ఒక పోస్టు ఖాళీగా ఉంటే, పీటీఆర్ ప్రకారం ఒక ఎస్జీటీ సరిపోతే ఆ ఖాళీ పోస్టును బ్లాక్ చేయనున్నారు. అయితే నమోదు 21 నుంచి 59 మధ్య ఉంటే ఆ ఖాళీని కౌన్సెలింగ్‌లో చూపనున్నారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలో నమోదు 55 ఉండి, ఒక పీఎస్ హెచ్‌ఎంతో పాటు నాలుగు ఎస్జీటీ పోస్టులు మంజూరైనప్పటికీ పీటీఆర్ ప్రకారం ఒక పీఎస్‌హెచ్‌ఎం, మూడు ఎస్జీటీలు సరిపోతే మిగిలిన ఖాళీ పోస్టును బ్లాక్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. నమోదు 60 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఆ ఖాళీని కౌన్సెలింగ్‌లో చూపవచ్చని స్పష్టం చేశారు. జూన్ 20 నాటికి విద్యార్థుల నమోదు ‘0’ ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న మంజూరిత పోస్టులను ఎంటీఎస్ కౌన్సెలింగ్‌లో ప్రదర్శించరాదని ఆదేశించారు.
2008 డీఎస్సీ వారికి ప్రథమ ప్రాధాన్యం
కౌన్సెలింగ్‌లో ముందుగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత 1998 డీఎస్సీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే సింగిల్ టీచర్ స్కూల్‌లో ఎంటీఎస్ టీచర్ పనిచేస్తుంటే, ప్రత్యామ్నాయ టీచర్‌ను కేటాయించే వరకు ఆ ఉపాధ్యాయుడిని రిలీవ్ చేయరాదని సూచించారు. అన్ని ఖాళీల కేటాయింపులు పూర్తిగా సీనియారిటీ ఆధారంగానే జరగాలని, ఎలాంటి మినహాయింపులూ ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి, జూన్ 22 నాటికి పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
గతేడాది కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన వారికి అవకాశం లేదు
సీనియర్ జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
ఈ నెల 22లోపు ప్రక్రియ పూర్తికి ఆదేశం
కీలక మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్


