వేలం పెడతారు..పాడుకోండప్పో! | - | Sakshi
Sakshi News home page

వేలం పెడతారు..పాడుకోండప్పో!

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

కళ్యాణదుర్గం రూరల్‌: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఊరూరా మద్యం బెల్టుషాపులు వెలిశాయి. వీటి కోసం ‘తమ్ముళ్ల’ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముకునే వెసులుబాటు ఉండడంతో మంచి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో బెల్టుషాపుల నిర్వహణకు టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో వేలం పాట నిర్వహించి మరీ బెల్టుషాపులు అప్పగిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో బెల్టు షాపుల ఏర్పాటు కోసం టీడీపీ నాయకులు గురువారం రాత్రి వేలం పాట నిర్వహణకు సిద్ధమయ్యారు. అంతకుముందు గ్రామంలో దండోరా వేయించారు. వేలంలో పాల్గొనేవారికి స్థానికంగా ఓటు హక్కు ఉండాలని, ఆధార్‌, పాసుపోర్టు సైజ్‌ ఫొటోలు కలిగి ఉండాలని, వారి వివరాలు నమోదు చేసుకుని వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారని చాటింపు వేయడం గమనార్హం. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధి సూచన మేరకు వేలంపాట నిర్ణయాన్ని ‘తమ్ముళ్లు’ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు గ్రామాల్లో బెల్టుషాపులు పెడితే తాట తీస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తుండగా..మరోవైపు ఆయన పార్టీ వారే పల్లెల్లో దండోరా వేయించి మరీ బెల్టు షాపులకు వేలం నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

మైనార్టీలపై బండ బూతులు

రెచ్చిపోయిన మంత్రి పయ్యావుల అనుచరుడు !

సాక్షిటాస్క్‌ఫోర్స్‌: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అనుచరుడు, ఉరవకొండ మండల టీడీపీ నాయకుడు రవి మద్యం మత్తులో బుధవారం రాత్రి వీరంగం సృష్టించాడు. ఉరవకొండలోని అనంతపురం–బళ్లారి జాతీయ రహదారి వద్ద ఉన్న ఓ ధాబా వద్ద మద్యం మత్తులో అందరూ చూస్తుండగానే అక్కడే ఉన్న కొందరు మైనార్టీలను ఇష్టారాజ్యంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తనకు మంత్రి అండదండలు ఉన్నాయని, ముస్లింలు ఏం పీక్కోలేరని రెచ్చిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఉరవకొండ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement