ఇసుక టిప్పర్లను ఆడ్డుకున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్లను ఆడ్డుకున్న రైతులు

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

శింగనమల: మండలంలోని నిదనవాడ వద్ద ఉన్న పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ వాహనాలను గ్రామస్తులు గురువారం రాత్రి అడ్డుకున్నారు. కొంత కాలంగా నది పరివాహక ప్రాంతంలో టీడీపీ నేతలు జేసీబీలు, హిటాజీలు ఏర్పాటు చేసి, టిప్పర్ల ద్వారా ఇసుకను పెద్దవడుగూరు మీదుగా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల రోజులుగా ఈ దందా ఊపందుకుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పార్టీలకు అతీతంగా రైతులందరూ సమావేశమై చర్చించారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు అందకుండా పోతోందని, ఫలితంగా భవిష్యత్తులో పంటలు సాగు చేయడం కష్టమవుతుందని భావించిన అందరూ ఇసుక తరలింపులను అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. దీంతో గురువారం రాత్రి పెన్నానదిలోకి ప్రవేశించిన టిప్పర్లను రైతులందరూ ఏకమై అడ్డుకున్నారు. వాహనాలను అడ్డుకున్న సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు.

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

గుంతకల్లు టౌన్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టుబడిన వారిలో మధ్యప్రదేశ్‌లోని థార్‌ జిల్లా కుక్సీ గ్రామానికి చెందిన అశోక్‌ ధ్యాన్‌ సింగ్‌, రాజుసింగ్‌ మెహడా ఉన్నారు. వీరి నుంచి 7.2 తులాల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నిందితులు అనంతపురం 4వ పట్టణ పీఎస్‌తో పాటు గుంతకల్లులోని వన్‌టౌన్‌ పీఎస్‌ పరిధిలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 55 తులాల బంగారు నగలు, 150 తులాల వెండి సామగ్రి, రూ.2.20 లక్షల నగదు అపహరించారు. గుంతకల్లులో చోటు చేసుకున్న చోరీలకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు సీఐలు మనోహర్‌, ప్రవీణ్‌ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం అశోక్‌ ధ్యాన్‌సింగ్‌, రాజుసింగ్‌ గుంతకల్లులోని ఢీజిల్‌ షెడ్‌ వద్ద తచ్చాడుతుండగా పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement