గార్లదిన్నెలో గ్యాస్ ఆటో వద్ద సిలిండర్లు తీసుకుంటున్న దృశ్యం
పెద్దవడుగూరులో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ
పెద్దవడుగూరు/ యాడికి/ గార్లదిన్నె : తెలుగు సంవత్సరాది ఉగాదితో పాటు రంజాన్ పండుగ వేళ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఇరాన్, అమెరికా– ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా నెమ్మదించింది. మూడు వారాలవుతున్నా యుద్ధం ఆగకపోవడంతో గ్యాస్ సరఫరాలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయినా అధికారులు గ్యాస్ కొరత లేదని ప్రకటిస్తున్నారు. కానీ గ్యాస్ బుకింగ్ కావడం లేదు. సర్వర్ సమస్య కారణంగా ఆన్‌లైన్‌లో రీఫిల్ బుకింగ్ కాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌ల వద్దకు క్యూ కడుతున్నారు. మంగళవారం పెద్దవడుగూరు, యాడికి, గార్లదిన్నె మండల కేంద్రాల్లోని ఇండేన్, భారత్ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు ఖాళీ సిలిండర్లను తీసుకొచ్చి బారులుదీరారు. అయినా తగినన్ని సిలిండర్లు లేకపోవడంతో చాలామంది వెనుదిరిగారు. పండుగ ఎలా చేసుకోవాలోనని ఆందోళన చెందుతున్నారు.


