అనంతపురం: మాతాశిశు మరణాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మాతాశిశు సేవలపై శ్రద్ధ వహించాలని కోరారు. భవిష్యత్తులో మాతాశిశు మరణాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రతి ఇంటినీ సందర్శించి గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు తగిన పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రమాదకరమైన లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత వైద్యాధికారి వద్దకు తీసుకువెళ్లి పరీక్షలు చేయించాలని కోరారు. గ్రామస్థాయిలో ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపట్టినప్పుడు పిల్లలు, వారి వయస్సు తగ్గ బరువు చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ నాగ శశిభూషణ్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డేవిడ్ సెల్వరాజ్, అనస్తీషియన్ డాక్టర్ సోమశేఖర్, చిన్నపిల్లల వైద్యులు దినకర్, శ్రీనివాసులురెడ్డి, బి.విష్ణుమూర్తి, పి.ప్రమీలాదేవి, హేమలత తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కడప డీఆర్‌ఓగా మల్లికార్జునుడు
అనంతపురం అర్బన్: అనంతపురం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న కె.మల్లికార్జునుడును వైఎస్సార్ కడప జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ)గా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: జిల్లాలో ముగ్గురు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లకు (పీడీసీ) పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో జి.వెంకటరమాకాంత్‌రెడ్డిని అనంతపురం హెచ్‌పీసీల్ సీఏగా, దేవరకొండ అఖిలను కేఆర్‌ఆర్‌సీ (కోనేరు రంగారావు కమిటీ) ఎస్‌డీసీగా, ఇ.కిరణ్మయిని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ (ల్యాండ్ అక్విజేషన్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ఉమ్మడి జిల్లాకు
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు రాగల నాలుగు రోజులు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారంతో పాటు 19వ తేదీన 3.2 మి.మీ, 20న 8 మి.మీ, 21న 3 మి.మీ, 22న ఒక మి.మీ సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 37.6 నుంచి 38.9 డిగ్రీలు, రాత్రిళ్లు 23.3 నుంచి 24.9 డిగ్రీల మేర ఉండవచ్చని తెలిపారు.
ఐఐటీ మద్రాస్‌తో జేఎన్‌టీయూ(ఏ) ఎంఓయూ
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురంతో ఐఐటీ మద్రాస్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఐసీఎస్‌ఆర్ స్వయం ప్లస్ వేదికపై అందించే పరిశ్రమ అనుసంధానిత కోర్సులు, ఉపాధి కల్పన ఆధారిత నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఆధునిక సాంకేతిక విద్యా అవకాశాలు బలోపేతం చేసే దిశగా ఎంఓయూ దోహదపడుతుందని జేఎన్‌టీయూ(ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. ఐఐటీ మద్రాస్‌లో జేఎన్‌టీయూ (ఏ) తరఫున వీసీ సుదర్శనరావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వి.కామకోటి పరస్పరం అవగాహన ఒప్పందాలను మార్పు చేసుకున్నారు.


