అనంతపురం అర్బన్: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక (పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్– పీఎల్‌పీ) అంచనాలు రూ.19,934 కోట్లు అని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, రైతుల ఆదాయవృద్ధిని దృష్టలో ఉంచుకుని వార్షిక రుణ ప్రణాళిక రూపొందించామన్నారు. బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో రుణ లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్య, పునరుత్పాదక శక్తి వంటి రంగాలకు గణనీయమైన రుణాలు అందించేలా వార్షిక రుణ ప్రణాళిక రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, ఆర్‌బీఐ మేనేజర్ రోహిత్ అగర్వాల్, నాబర్డ్ ఏజీఎం అనురాధ, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య పాల్గొన్నారు.
లక్ష్యాలను పూర్తి చేయాలి
ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేటాయించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు కచ్చితంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు రుణ మంజూరులో నిర్లక్ష్యంవహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానమంత్రి ‘ముద్ర’ రుణాలు 2025–26లో రూ.863.6 కోట్లు రుణాలు మంజూరు చేయల్సి ఉండగా 62.90 శాతం చేశారన్నారు. రుణాల మంజూరులో పురోగతి సాధించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే వివిధ శాఖల్లో ఉన్న డిపాజిట్లను ఉపసంహరిస్తామని చెప్పారు. డీఆర్‌డీఏ, మెప్మా, పరిశ్రమలు, ఉద్యాన శాఖల అధికారులు వారి పరిధిలో పథకాలకు బ్యాంకుల వారీగా పంపిన వివరాలను పూర్తిస్థాయిలో అందించాలన్నారు. సమావేశంలో బ్యాంకర్లు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.


