● రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ
గుంతకల్లు: ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ పేర్కొన్నారు. మంగళవారం భద్రతా తనిఖీల్లో భాగంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని గుంతకల్లు–బళ్లారి సెక్షన్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తాతో కలిసి ప్రత్యేక రైలులో రియర్ విండో ద్వారా రైలు మార్గాన్ని పరిశీలించారు. ఈ సెక్షన్‌లోని రైల్వే ట్రాక్ ఒంపులు, లెవల్ క్రాసింగ్‌లు, సిగ్నల్ వ్యవస్థతోపాటు రైల్వే బ్రిడ్జిలు పరిశీలించి భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సెక్షన్ ఎక్కవగా రద్దీగా ఉండటంతో రైళ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఆరా తీశారు. రైళ్లు సమయ పాలనను పాటించేలా ఇంజినీరింగ్, సిగ్నల్, ఆపరేషన్ విభాగం సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఈ సెక్షన్‌లోని కీలకమైన, సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెంచడంతోపాటు ట్రాక్ పట్టిషం చేయడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న ప్రణాళికపై నిశితంగా అధికారులకు తెలియజేశారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా విభాగాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


