పేదలంటే బాబుకు ‘కళ్ల’ మంట!
● ఆగిన సీఎం ఐ కేర్ కేంద్రాల సేవలు
● కళ్లజోడు నమోదు ప్రక్రియ బంద్
● ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు తప్పని అవస్థలు
కళ్యాణదుర్గం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యం అందని ద్రాక్షగానే మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నెట్ వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకుపోవడంతో ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అందకుండా పోయాయి. తాజాగా సీఎం ఐ కేర్ సెంటర్ల నిర్వహణలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తిసింది. ఫలితంగా కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందకుండా పోతున్నాయి. ప్రస్తుతం ఈ సెంటర్లను చంద్రబాబు ప్రభుత్వం మూసివేసింది. గద్దెనెక్కిన మూడు నెలల్లోనే ఈ పథకానికి మంగళం పాడేయగా... ప్రస్తుతం సెంటర్లు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. దీంతో నేత్ర పరీక్షలు చేయించుకోలేక, కళ్లజోళ్లు పొందే అవకాశం కోల్ఫోయిన పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి.
కష్ట కాలంలోనూ ఆగని వైద్య సేవలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా 2017లో చంద్రబాబు అమలు చేసిన సీఎం ఐ కేర్ సెంటర్లను నిబద్ధతతో కొనసాగిస్తూ వచ్చారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం పేరుతో సరికొత్త హంగులు అద్ది మరింత విస్తరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా కంటి వైద్య సేవలను అందజేస్తూ వచ్చారు. ఇందు కోసం రూ. కోట్లు విలువ చేసే అత్యాధునిక ఫండస్ మిషన్, ఏఆర్ మిషన్లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సమకూర్చారు. ప్రతి కేంద్రంలోనూ ఒక ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వీరు విశిష్ట సేవలు అందించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి రెండు వారాల్లోపు కళ్లజోళ్లను ఆశా కార్యకర్తల ద్వారా నేరుగా ఇంటి వద్దకే అందించారు. ఈ పథకం కింద అప్పట్లో రోజుకు 100 మందికి పైగా కళ్యాణదుర్గం సీహెచ్‌సీలో ఓపీ జరిగింది.


