9 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం నిర్ధేశించిన మద్ధతు ధరతో క్వింటా రూ.8 వేల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 5,964 మంది రైతుల నుంచి రూ.77 కోట్లు విలువ చేసే 9,706 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పి.పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో రూ.55 కోట్ల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. 3,298 మంది రైతుల ఖాతాల్లోకి రూ.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు.
కొరియర్ సెంటర్‌లో చోరీ
శింగనమల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పక్కనే ఉనన పార్సిల్ కొరియర్ సెంటర్‌లో చోరీ జరిగింది. ముసుగులు ధరించిన ఇద్దరు యువకుల కదలికలు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమై ఉంది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కొరియర్ సెంటర్ వద్దకు చేరుకున్న దుండగులు ముందుగా తలుపు వద్ద ఉన్న సీసీ కెమెరాను తొలగించారు. అనంతరం తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. పార్శిళ్లను పరిశీలించి, విలువైన వస్తువులున్న వాటిని అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
900 హెక్టార్లకు ఆటోమేషన్ లక్ష్యం
కూడేరు: ఈ ఏడాది మార్చి లోపు జిల్లా వ్యాప్తంగా 900 హెక్టార్లకు ఆటోమేషన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథ రెడ్డి తెలిపారు. ఆటోమేషన్ టెక్నాలజీపై కూడేరులోని వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ శంకరబాబు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దేవానందతో పాటు ఆయన మాట్లాడారు. ఆటోమేషన్ విధానం ద్వారా నీటి వృధాని అరికట్డడంతో పాటు రైతులకు శ్రమ కూడా తగ్గుతుందన్నారు. రైతులు పొలాల్లోనే ఉండి పంటలకు నీటిని సరఫరా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి వద్ద నుంచే సెల్‌ఫోన్ ద్వారా పంటలకు ఎంత మోతాదులో నీరు అవసరమో అంతే అందించే అవకాశం ఉంటుందన్నారు. 55 శాతం సబ్సిడీతో ఆటోమేషన్ పరికరాలను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, ఉద్యానాధికారి యామిని పాల్గొన్నారు.


