ముగిసిన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

Feb 14 2026 7:53 AM | Updated on Feb 14 2026 7:53 AM

ముగిస

ముగిసిన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

అనంతపురం: ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం సజావుగా ముగిశాయి. అనంతపురం జిల్లా కోర్టులో 883, కదిరిలో 101, పెనుకొండలో 65, హిందూపురంలో 100, కళ్యాణదుర్గంలో 49, రాయదుర్గంలో 50, ఉరవకొండలో 15, ధర్మవరంలో 83, పుట్టపర్తిలో 20, మడకశిరలో 28, తాడిపత్రిలో 73, గుత్తిలో 92, గుంతకల్లులో 108 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఆలూరి రామిరెడ్డి, బడా నారాయణరెడ్డి, రాంకుమార్‌, జక్కల శ్రీనివాసులు పోటీ చేశారు. అనంతపురం జిల్లా కోర్టులో తొలిసారిగా భారీ ఎత్తున ఓట్లు పోలవ్వడం విశేషం. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

రేపటి నుంచి హేమావతి బ్రహ్మోత్సవాలు

అమరాపురం: మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా సాగుతుంటాయి. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆదివారం అఖండ పూజలు, విశేష అభిషేకాలు, భజనలు, కీర్తనలు ఉంటాయి. 16న భానుపల్లకి, ధూళోత్సవం, అన్నసంతర్పణ, 17న అగ్నిగుండం ప్రవేశం, ముత్యాలపల్లకీ ఉత్సవం, వివిధ రకాల పుష్పాలంకరణ ఉంటుంది. 18న సాయంత్రం సిడిమాను ఉత్సవం, అన్నసంతర్పణ, రాత్రికి ముత్యాలపల్లకీ ఉత్సవం, 19న చిన్న రథోత్సవం, రాత్రి ముత్యాల పల్లకీ ఉత్సవం, 20న బ్రహ్మరథోత్సవం, అన్నసంతర్పణ, 21న వసంతోత్సవం, 22న శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది.

వ్యక్తి బలవన్మరణం

పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లికి చెందిన శ్రీరాములు(43) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కుటుంబసభ్యులు, స్నేహితుల వద్ద వాపోయేవాడు. గత బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ఆయన తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువులు, స్నేహితులు గాలిస్తూనే ఉన్నారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా శ్రీరాములు ఆచూకీ గుర్తించిన పోలీసులు వెంటనే గ్రామ శివారులోని పొలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే మామిడి చెట్టుకు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న శ్రీరాములు మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి హనుమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు లాంఛనాలతో

జాగిలానికి అంత్యక్రియలు

పుట్టపర్తి టౌన్‌: వయోభారం కారణంగా పోలీసు విశ్రాంత జాగిలం శాండి శుక్రవారం మృతి చెందింది. జిల్లా పోలీస్‌ శాఖలో 2013 నుంచి 2024 వరకు విశిష్ట సేవలు అందించిన ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరి. గత ఏడాది నవంబర్‌ 30న పదవీ విరమణ పొందింది. జాగిలం మృతి చెందిన విషయం తెలియగానే ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్‌, వలి, రవికుమార్‌ తదితరులు శాండీ కలేబరంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది చెన్నప్ప, బీడీటీం సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన  బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు 1
1/3

ముగిసిన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ముగిసిన  బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు 2
2/3

ముగిసిన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ముగిసిన  బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు 3
3/3

ముగిసిన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

Advertisement
 
Advertisement
Advertisement