రెవెన్యూ అధికారి ‘దూకుడు’ | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారి ‘దూకుడు’

Feb 14 2026 7:51 AM | Updated on Feb 14 2026 7:51 AM

రెవెన్యూ అధికారి ‘దూకుడు’

రెవెన్యూ అధికారి ‘దూకుడు’

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆయన రెవెన్యూ శాఖలో డివిజనల్‌ స్థాయిలో కీలక అధికారి. రిటైర్డ్‌మెంట్‌ దగ్గర పడుతుండడంతో ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల’నే నానుడిని బాగా వంట పట్టించుకున్నారు. ఆయన అదృష్టం కొద్దీ సామాజికవర్గమూ కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీకి బలంగా ఉంటున్న సామాజిక వర్గానికి చెందినవ్యక్తి కావడంతో చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా వ్యవహరిస్తూ అక్రమాలకు తెరతీశారు. ఆ సామాజికవర్గంలో కీలకమైన ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతుండడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈయన ‘బరితెగింపు’ అధికార పార్టీతోపాటు రెవెన్యూశాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన వ్యవహారంపై కొందరు ఏకంగా సీఎంఓ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి గుట్టుగా ఆరా తీస్తున్న వైనం రెవెన్యూశాఖలో కలకలం రేపుతోంది.

వివాదాల భూములు.. ఏకపక్ష నిర్ణయాలు

వివాదం ఉన్న భూముల వ్యవహారంలో ఆ అధికారి చాలావరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) కేసుల విచారణ వివాదాస్పదమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి వారం 100కు పైగా కేసులను విచారణకు పిలుస్తుండడం పట్ల చర్చ జరుగుతోంది. గతంలో వారానికి 30 కేసులకు మించి విచారణకు పిలిచేవారు కాదు. ఈ అధికారి రిటైర్డ్‌మెంట్‌ తేదీ దగ్గర పడేకొద్దీ కేసుల సంఖ్య పెంచుతూ వస్తున్నారని చెబుతున్నారు. కొన్ని కేసల్లో నాలుగుసార్లు నోటీసులు ఇచ్చి తుది తీర్పు ఇచ్చేస్తున్నారు. ‘కమిట్‌’ అయిన వారితో ప్రతి ఫైలుకూ రూ. లక్షల్లోనే తన వాటా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈయన ఏకపక్షంగా ఇచ్చిన తీర్పులపై హైకోర్టును ఆశ్రయిస్తున్న బాధితులకు అక్కడ ఊరట లభిస్తోంది. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్‌, రాప్తాడు మండలాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట 172 సర్వే నంబరులోని భూ వివాదంపై ఈయన ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అలాగే కక్కల పల్లి, కాటిగానికాలవ, నరసనాయనికుంట గ్రామాల్లోని భూములకు సంబంధించి ఈయన ఉత్తర్వులను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇంకా పలువురు బాధితులు ఈయన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోరునాశ్రయించారు. ఏదేమైనా ఆర్‌ఓఆర్‌ కేసులు ఈయనకు పెద్ద ఆదాయవనరుగా మారాయి.

తహసీల్దార్‌ కార్యాలయ నివేదికలు కూడా అక్కడి నుంచే...

ఆర్‌ఓఆర్‌ కేసులకు సంబంధించి పిటీషనర్లు, రెస్పాండెంట్లకు నోటీసులు ఇచ్చి రికార్డులను తెప్పించుకుంటారు. ఆ రికార్డులను సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపి క్షేత్రస్థాయిలో విచారణ చేయించి నివేదికలను తెప్పించుకుంటారు. వాటి ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా కేసుల్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆర్‌ఓఆర్‌ కేసులకు సంబంధించి తాను మాట్లాడుకున్న వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు.. తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి రావాల్సిన నివేదికలు (ఫైళ్లు) అక్కడే సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం సంతకాల కోసం తహసీల్దార్ల కార్యాలయాలకు పంపుతున్నారు. సంబంధిత వీఆర్‌ఓ, ఆర్‌ఐఓ, డీటీ, తహసీల్దారు సంతకాలు చేయాలి. ఇక్కడ కాదుగీదు అనేకి లేదని మండలాల ఉద్యోగులు వాపోతున్నారు. మరికొన్ని కేసుల్లో సదరు అధికారి బరితెగించి ఇచ్చిన ఉత్తర్వులను ధైర్యం చేసి తాము అమలు చేయలేకపోతున్నామని ఓ డీటీ వాపోయారు. ఓ మిల్ట్రీ పట్టా ఫేక్‌ అని నిర్ధారించినా కూడా.. ఆ కేసులో భారీగా దండుకున్న అధికారి ఆ పట్టాను అడ్డుపెట్టుకుని కొనుగోలు చేసిన వారికి ఆన్‌లైన్‌లో ఎక్కించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం కలెక్టరేట్‌లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సీఎంఓ దృష్టికి వ్యవహారం

ఈ అధికారి నెలల వ్యవధిలోనే రూ.కోట్లకు పడగలెత్తాడని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. ఏమైనా మాట్లాడితే ప్రొటోకాల్‌ ఖర్చులు అంటూ జిల్లా ఉన్నతాధికారుల పేర్లను వాడుకుంటున్నారని వాపోతున్నారు. ఈయన బరితెగింపు వ్యవహారం చివరకు సీఎంఓ దృష్టికి కూడా వెళ్లిందని చెబుతున్నారు. అక్కడి నుంచి కీలక అధికారులు, ప్రజాప్రతినిధులను ఆరా తీస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈయన వ్యవహారంపై ఓ కన్నేశారు.

రిటైర్మెంట్‌ దగ్గర పడుతుండటంతో అక్రమ వసూళ్లు

భూవివాదాల్లోవిపరీతమైన జోక్యం

రికార్డుస్థాయిలో ప్రతి వారం వందదాకా కేసుల విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement