నమ్మించి మోసం చేశారు
● చంద్రబాబు ప్రభుత్వంపై ఎస్టీయూ నాయకుల ధ్వజం
అనంతపురం అర్బన్: ‘మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అవుతున్నా పీఆర్‌సీ కమిటీ వేయకుండా మోసం చేశారు. ఇంతటి దౌర్భాగ్యం ఎన్నడూ లేదు’ అంటూ ఎస్టీయూ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు మాట్లాడుతూ కొత్తగా తీసుకొస్తున్న 33 ఏళ్ల సర్వీసు విధానం ఉద్యోగుల మెడలో పాములాంటిదన్నారు. అది ఎప్పుడైనా కాటువేయవచ్చని హెచ్చరించారు. రెండేళ్లు అవుతున్నా పీఆర్‌సీ కమిటీ వేయకపోవడం దారుణమన్నారు. 12వ పీఆర్‌సీ కమిటీ వేయడంతో పాటు మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, పీఆర్‌సీ బకాయిలు తక్షణం చెల్లింపునకు రోడ్‌మ్యాప్ ప్రకటించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలను చర్చకు పిలిచి డీఏలు ఇస్తామని చెప్పారని, తీరా ఒక డీఏ ఇచ్చి తీవ్ర నిరాశకు గురిచేశారన్నారు. పాత పెన్షన విధానం అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 మేరకు పాత పెన్షన అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన సౌలభ్యాలు చెల్లించకుండా వారిని ఏడిపిస్తూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పదవీ విరమణ చేసి మరుసటి రోజునే సౌలభ్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సూరీడు, ఫణిభూషణ్, కృష్ణమూర్తి, రాజశేఖర్, జిల్లా నాయకులు నాగభూషణం, మల్లికార్జున, సుధాకర్, నాగేంద్ర, రాధాకృష్ణంరాజు, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.


