మెటీరియల్ పేమెంట్లు పూర్తి చేయాలి
అనంతపురం అర్బన్: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టి పనులకు సంబంధించి రూ.22 కోట్ల చెల్లింపులు ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి ఉపాఽధి హామీ కింది మెటీరియల్ ఎక్స్‌పెండేచర్, మెటీరియల్ పేమెంట్లు, తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంసీసీ సిబ్బంది, పీఆర్ ఏఈలు, ఈసీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెటీరియల్ పేమెంట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజూ రూ.7.35 కోట్ల విలువైన పనులు అప్‌లోడ్ చేయాలన్నారు. శని, ఆది వారాలు సెలవు రోజులైనప్పటికీ ఎంపీడీఓలు, ఏపీఓలు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన మెటీరియల్ బడ్జెట్‌ను ఈ నెలాఖరులోగా పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ సలీంబాషా, పీఆర్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, తదితరులు పాల్గొన్నారు.


