జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.
కంటితుడుపుగా
టమాట కొనుగోలు
అనంతపురం అగ్రికల్చర్: టమాట ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి మార్కెట్‌కు ఇటీవల కాలంలో రోజూ 600 నుంచి 800 టన్నుల వరకు సరుకు అమ్మకానికి వస్తోంది. అయితే ధరలు పతనం కావడంతో కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. నెలన్నర రోజులుగా అత్యంత నాణ్యమైన టమాట గరిష్ట ధర కిలో రూ.10 పలుకుతుండగా మిగతావన్నీ రూ.5 నుంచి రూ.7కు మించి పలకడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ కంటితుడుపు చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రోజుకు 30 నుంచి 40 టన్నుల టమాటా కొనుగోలు చేస్తూ పక్క జిల్లాలకు సరఫరా చేస్తుండగా.. అలాగే ఆటోల ద్వారా కిలో రూ.10 ప్రకారం విక్రయాలు మొదలు పెట్టారు. మార్కెటింగ్ శాఖ కూడా రైతుల నుంచి కిలో రూ.5 ప్రకారం కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కొన్ని లాట్లు అమ్ముడుపోక వదిలేసుపోతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రైతులకు ఏదో లబ్ధి చేకూర్చుతున్నట్లు చెప్పుకునే క్రమంలోనే కంటితుడపు చర్యలకు దిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


