సేవాలాల్ జయంత్యుత్సవాలు ప్రారంభం
గుత్తి రూరల్: బంజారాల ఆరాధ్య దైవం సంత్‌శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు శుక్రవారం గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు మాతా జగదాంబ ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ చేశారు. సేవాలాల్ ఆలయ ముఖద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం వైద్యశిబిరం, ఫొటో ఎగ్జిబిషన్, మరుగుదొడ్లు, వసతి ఏర్పాట్లతో పాటు ద్విచక్రవాహనాలు, జీపులు, కార్ల పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
మాతా జగదాంబ ఆలయంలో హోమం
సేవాగఢ్‌లోని మాతా జగదాంబ ఆలయ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, అభిషేకం తదితర పూజలు చేశారు.
భారీ బందోబస్తు
సేవాలాల్ జయంత్యుత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు తెలిపారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులతో సమావేశమైన సీఐ వారికి దిశానిర్దేశం చేశారు.
ఉత్సవాలు విజయవంతం చేయండి
సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్, కార్యదర్శి అశ్వత్థనాయక్ కోరారు. ఆలయ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలను పూర్తి చేశామన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు భోజన ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్‌నాయక్, డీటీ సూర్యనారాయణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
సేవాలాల్ మహరాజ్ మూలవిరాట్, మాతా జగదాంబ ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతున్న ట్రస్టు సభ్యులు
సేవాలాల్ జయంత్యుత్సవాలు ప్రారంభం


