మింగేస్తున్న నిర్లక్ష్యం!
కళ్యాణదుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కాలువ పనుల వద్ద చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌సీ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ‘ఎస్‌ఆర్‌సీ’.. చిరుజీవుల పట్ల చిన్నచూపు వైఖరి ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి.
అంతా గప్‌చుప్..
ఇటీవల బోరంపల్లి– గంగవరం గ్రామాల మధ్య జరుగుతున్న బీటీపీ కాలువ పనుల వద్ద టిప్పర్ బోల్తా పడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని ఎస్‌ఆర్‌సీ యాజమాన్యం కప్పిపుచ్చడం గమనార్హం. గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనను మరువక ముందే శుక్రవారం అర్ధరాత్రి బోరంపల్లి వద్ద ఉన్న క్యాంప్ సమీపంలో ఐజాక్స్ (కాంక్రీట్ కలిపే వాహనం) చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు నవీన్ (26), ఇంద్రపాల్‌రామ్, మునేశ్వర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద ఘటనపై ఎస్‌ఆర్‌సీ కంపెనీ ప్రతినిధులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చేందుకు గ్రామస్తులు యత్నించినా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చేసేదిలేక స్థానికులు క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపే నవీన్ అనే కూలీ మృత్యువాత పడడం గమనార్హం. గాయపడిన మరో ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారమూ చేరవేయరు..
బీటీపీ కాలువ పనుల వద్ద వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. పొట్టకూటి కోసం బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన తమ వారు మృతువ్యాత పడుతుండటం ఆయా కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తోంది. కార్మికులు మృత్యువాత పడినా బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంలో ఎస్‌ఆర్‌సీ యాజమాన్యం అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
సర్వ సాధారణమట!
వరుస ప్రమాదాలు జరుగుతున్నా, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ఎస్‌ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్ చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే కార్మికులకు శాపంగా మారినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని కంపెనీ నిర్వాహకులు కార్మికుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద కాలువలో
బోల్తా పడిన టిప్పర్ (ఫైల్)
ప్రమాదంలో గాయపడి మృతి చెందిన
మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడు నవీన్
బీటీపీ కాలువ పనుల వద్ద
వరుస ప్రమాదాలు
పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు
కోల్పోతున్న చిరుజీవులు
చోద్యం చూస్తున్న
ఎస్‌ఆర్‌సీ కంపెనీ యాజమాన్యం
మింగేస్తున్న నిర్లక్ష్యం!


