ఓవరాల్ చాంపియన్‌గా ‘అనంత’
అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రస్థాయి 7వ రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో 38 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను అనంతపురం జట్టు కై వసం చేసుకుంది. తర్వాతి రెండు స్థానాల్లో వరుసగా విశాఖపట్నం, కాకినాడ జిల్లాలు నిలిచాయి. మూడ్రోజులుగా ఆర్డీటీ స్టేడియం వేదిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెవెన్యూ క్రీడలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖామాత్యులు అవగాని సత్యప్రసాద్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవితతో పాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిడంబి శ్రీకాంత్, టెన్నిస్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కేశవ్ హామీనిచ్చారు. మంత్రి అవగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు తిరుపతిలో రెవెన్యూ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేలతో రెవెన్యూ ఉద్యోగులు నరకయాతన పడుతున్నారని, సర్వేలు, తదితర పనులకు నిర్ధేశిత సమయం కేటాయించాలన్నారు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డీటీలకు శిక్షణనిచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, డీఆర్‌ఓ మలోల, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్, డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునుడు, మల్లికార్జున రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చివరి రోజు హోరాహోరీగా మ్యాచ్‌లు..
ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం వివిధ విభాగాల్లో ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. క్రికెట్‌లో మొదటి మ్యాచ్‌లో కృష్ణ, అనంతపురం జట్లు తలపడగా... కృష్ణా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. త్రోబాల్ (ఉమెన్)లో చిత్తూరు విజేతగా, కాకినాడ రన్నర్స్‌గా, టగ్ ఆఫ్ వార్ (మెన్)లో కాకినాడ విజేతగా, నెల్లూరు రన్నర్‌గా, ఉమెన్‌లో కాకినాడ విన్నర్‌గా, విశాఖపట్నం రన్నర్‌గా నిలిచాయి. 100 మీటర్ల(మెన్)పరుగు పందెంలో రవివర్మ (విశాఖ), ఉమెన్‌లో వి.లలిత (అనంతపురం) మొదటి స్థానంలో నిలిచారు. వంద మీటర్ల రిలే పరుగు (మెన్)లో విశాఖ మొదటి స్థానం, నెల్లూరు రెండో స్థానంలో నిలిచాయి. ఉమెన్ విభాగంలో అనంతపురం మొదటి స్థానం, శ్రీ సత్యసాయి జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో(ఉమెన్) విశాఖపట్నంపై అనంతపురం జట్టు విజయం సాధించింది.
ముగిసిన రెవెన్యూ క్రీడలు
విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసిన మంత్రులు సత్యప్రసాద్, కేశవ్, సవిత


