న్యాయం చేయండి
● ‘పరిష్కార వేదిక’లో ప్రజల విన్నపాలు
● వివిధ సమస్యలపై 377 వినతులు
● ఇతని పేరు సాకే రాముడు. అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం పంచాయతీ రాయల్ నగర్ నివాసి. సర్వే నంబరు 204–2ఏలో ఇతనికి 2.50 సెంట్ల స్థలం ఉంది. పంచాయతీ వాళ్లు ఎలాంటి సర్వే నిర్వహించకుండా స్థలం మధ్య నుంచి 13 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించారు. తన ప్లాటులో వేసిన రోడ్డు తొలగించాలంటూ ఏడేళ్లుగా కలెక్టర్ కార్యాలయంలో అర్జీ ఇస్తూనే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదని రాముడు ఆవేదన వ్యక్తం చేశాడు.
అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలంటూ అధికారులకు ప్రజలు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఎ.ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్‌రెడ్డి, తిప్పేనాయక్, మల్లికార్జునుడు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 377 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలపై సమర్పించే అర్జీలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.
వినతుల్లో కొన్ని...
● తన సొంత స్థలంలో పంచాయతీ వాళ్లు సిమెంట్ రోడ్డు నిర్మించారని అనంతపురం రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ ఏఎస్‌ఆర్‌ఆర్‌నగర్‌కు చెందిన కాశీపతి శ్రీవిద్య ఫిర్యాదు చేసింది. తనకు సర్వే నంబరు 125/1లో ప్లాటు (నంబరు 90) ఉందని, పంచాయతీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీసీ రోడ్డు నిర్మించారని చెప్పింది. కోల్పోయిన స్థలానికి నష ్టపరిహారం కానీ ప్రత్యామ్నాయ స్థలం కానీ ఇవ్వలేదని తెలిపింది. సమస్యపై కలెక్టరేట్‌లో చాలా సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయింది.
● రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో తాను, తన పిల్లలు అనాఽథలయ్యామని కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన గుజ్జల లలిత వాపోయింది. గత ఏడాది ఆగస్టు 8న తన భర్త రామలింగ రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పింది. దీంతో తాము అనాథలుగా మారామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందింది. తనకు బతుకుదారి చూపించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
న్యాయం చేయండి


