అనంతలో హై అలర్ట్
అనంతపురం సెంట్రల్: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ ఉగ్రవాదుల కదలికలు వెలుగుచూశాయి. కొన్ని రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో లోనికోట వీధికి చెందిన నూర్ మహమ్మద్ నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యునిగా ఉన్నట్లు తేలడం.. ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించి అతడిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అదే గ్రూపులో ఉంటూ చర్చించుకుంటున్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో ఉమ్మడి జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. నిషేధిత ఉగ్ర సంస్థకు చెందిన తీవ్రవాదుల కదలికలు గతంలోనూ వెలుగుచూశాయి. ఉగ్రవాదులు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో రెండు రోజులు బస చేసినట్లు తేలడం అప్పట్లో అందరినీ కలవరపాటుకు గురి చేసింది. ఉగ్రవాదులు ఆయుధాల కొనుగోలు నిమిత్తం బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నారని, వాటిని ఇక్కడికి తీసుకొస్తానని సదరు వ్యక్తి చెప్పడంతో లాడ్జీలో మకాం వేసినట్లు తేలడం అప్పట్లో సంచలనం రేపింది. ఇలా తరచూ ఉగ్ర కదలికలు వెలుగు చూస్తుండడంతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు.
త్వరలో సత్యసాయి జయంతి..
పుట్టపర్తిలో ఈనెల 23న భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 13 నుంచే వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు వచ్చే అవకాశాలున్నాయని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. భగవాన్ సత్యసాయి బాబాకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భక్తులు ఉండడంతో పుట్టపర్తికి వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో పేలుళ్లు సంభవించడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
అప్రమత్తంగా ఉండాలి
దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని పోలీసులను ఆదేశించాం. అనుమానాస్పదంగా ఉన్నవారిని విచారించాలని సూచించాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు లేకపోయినప్పటికీ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ –100కు సమాచారం అందించాలి.
– జగదీష్, ఎస్పీ


