ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతాం
ఉరవకొండ: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజల మద్దతుతో అడ్డుకుని తీరతామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఉరవకొండలో నిర్వహించే నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ‘విశ్వ’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దన్నర కాలం సీఎంగా ఉండీ ఒక్క మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి వ్యక్తి నేడు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పజెప్పాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. బాబు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చి అందులో 5 పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే కళాశాలల నిర్మాణం పూర్తై 1,300 మెడికల్ సీట్లు రాష్ట్రానికి మంజూరయ్యేవన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. పీపీపీ విధానానికి మద్దతు తెలుపుతున్నారా లేదా అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ఒక వైపు వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తూ, మరోవైపు ఆరోగ్య శ్రీ సేవలకు మంగళం పాడిందన్నారు. పేదల ఆరోగ్యాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, పార్టీ మండల, రూరల్ సమన్వయకర్తలు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, హవళిగి భరత్‌రెడ్డి, డిష్ సురేష్, లత్తవరం గోవిందు, నాయకులు పచ్చిరవి, ధనంజయ, ఈశ్వర్, అంగదాల అంజి, కురుబ ప్రకాష్, గంగాధర్, వేమన్న, వడ్డే ఆంజినేయులు, బెలగల్‌షమ్ము, టైలర్ శర్మాస్, చిన్నభీమా, మహానంది, నాగరాజు, జేసీబీ రామకృష్ణ, గంధోడి మారేష్, కమ్మటి రామాంజినేయులు, ఎర్రిస్వామి పాల్గొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై
బాబు తీరు దుర్మార్గం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు
వై. విశ్వేశ్వర రెడ్డి


