ముదిగుబ్బ: గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. వీరి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ సోమవారం ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో సీఐ శివరాముడుతో కలిసి మీడియాకు వెల్లడించారు. గంజాయి నిర్మూలనలో భాగంగా డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ శివరాముడు సిబ్బందితో కలిసి తమకందిన సమాచారం మేరకు.. సోమవారం సాయంత్రం గంజాయి వ్యాపారం చేస్తున్న ఆరుగురితో పాటు గంజాయి సేవించే మరో ఆరుగురు వ్యక్తులను, అలాగే ఇద్దరు బాల నేరస్తులను ముదిగుబ్బ శివారులోని కాకతీయ హోటల్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మూడు కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ముద్దల నందకుమార్, ముత్తన సాయికుమార్, మేకల సాయితేజ, పోతిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, ముత్తన గణేష్‌లు అనంతపురానికి చెందిన షికారి గోవింద్‌తో కిలో రూ. 5వేల చొప్పున గంజాయి కొనుక్కొచ్చేవారు. దానిని చిన్న చిన్న కవర్లలో ప్యాకింగ్ చేసి ఒక్కొక్కటి రూ.200 నుంచి రూ.400 దాకా డిమాండ్‌ను బట్టీ ముదిగుబ్బకు చెందిన ముష్టూరు దాదాపీర్, నిధికుమార్, మేకల నాగేష్, సాకే పవన్‌కుమార్, మేకల నాగేష్, సాకే పవన్‌కుమార్, చెన్నంపల్లి గణేష్, తల సూరి, ప్రణవ్‌కుమార్ నాయుడు, ఇద్దరు బాల నేరస్తులకు రహస్యంగా అమ్మేవారు. అరెస్టయిన 12 మందిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి, అనంతరం రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. బాలలను జువైనల్ హోంకు తరలించారు.


