ఆ ఓటర్లు ఉన్నట్టా.. లేనట్టా..?
తాడిపత్రి రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాడిపత్రి నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లు తదితరాల తొలగింపునకు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఇటీవల 274 మంది బీఎల్వోలు రెండు ఓటర్ లిస్టులను ఆధారంగా చేసుకుని పరిశీలన చేశారు. 2002లో తాడిపత్రి నియోజకవర్గంలో 1,97,224 మంది ఓటర్లు ఉండగా, 2025కు సంఖ్య 2,50,391కు పెరిగింది. ఈ క్రమంలో రెండింటికి సంబంధించి 40 సంవత్సరాలకు పైబడి వయసున్న 1,27,187 మంది ఓటర్లను సరిపోల్చగా, కేవలం 48,874 మంది ఓటర్లే మ్యాచ్ కావడం గమనార్హం. ఏకంగా 78,313 మంది ఓటర్లు మ్యాచింగ్ కాకపోవడంపై అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మ్యాచింగ్ అయిన ఓటర్లను బీఎల్వోలు తమ లాగిన్‌లో నమోదు చేశారు. 40 సంవత్సరాల లోపు ఓటర్లకు సంబంధించి సరిపోల్చితే ఇంకెంత మంది మ్యాచ్ అవ్వరో తేలాల్సి ఉంది.
కారణాలు ఇవేనా..
ఓటర్లు సరిపోలకపోవడానికి పలు కారణాలను అధికారులు చెబుతున్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నాయకులు బోగస్ ఓట్లను ఇబ్బడిముబ్బడిగా చేర్చడం ఒక కారణమంటున్నారు. పేర్లు షార్ట్‌కట్ ఉండటం, సర్‌నేమ్‌లు లేకపోవడం, పేర్ల మార్పు తదితర కారణాల వల్ల కూడా మ్యాచింగ్ కాకపోయి ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ సోమశేఖర్ మాట్లాడుతూ ఎలాంటి తప్పులు లేకుండా పరిశీలన చేపడుతున్నామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నామన్నారు.
తాడిపత్రిలో 78,313 మంది
సరిపోలని ఓటర్లు


