బరితెగించిన ‘పచ్చ’ నాయకులు
● నాయనపల్లిలో ఆర్డీటీ స్థలం
కబ్జాకు యత్నం
● అడ్డుకున్న గ్రామస్తులు,
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి
శింగనమల (నార్పల): కూటమి ప్రభుత్వంలో ‘పచ్చ’ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. స్థలాలను ఆక్రమించుకోవడమే కాకుండా అడ్డుకున్న వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా నార్పల మండలంలోని నాయనపల్లిలో ఆర్డీటీ స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆక్రమించుకుంటుండగా అడ్డుకున్న గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. వివరాలు.. నాయనపల్లి దళిత కాలనీలో ఆర్డీటీ స్కూల్ కోసం గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓబిలేసు ఆ స్థలంపై కన్నేశాడు. ఆదివారం స్థలంలో పశువుల షెడ్ నిర్మాణానికి యత్నించాడు. ఈ క్రమంలో కాలనీవాసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకోగా ఓబిలేసు రెచ్చిపోయాడు. ఇంతలోనే పలువురు టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని దౌర్జన్యానికి దిగారు. ఒక్కసారిగా అందరిపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో శ్రావణకుమార్, శశికుమార్, కుళ్లాయప్ప, నారాయణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ సాగర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాకు గురవుతున్న ఆర్డీటీ స్థలాన్ని పరిరక్షించాలన్నారు.
‘పీఎంఏవై’ గడువు పెంపు
అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇళ్లు లేని నిరుపేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలు తమ దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పక్కా ఇంటిని మంజూరు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


