కూటమి నేతల ఇష్టారాజ్యం
రాయదుర్గం: బొమ్మనహాళ్ మండలం నేమకల్లు సమీపాన కూటమి నాయకుడు మైనింగ్ డాన్‌గా రెచ్చిపోతున్నాడు. 2019–14 మధ్య కంకర క్వారీల్లో జరిగిన అక్రమాలను అప్పటి టీడీపీ హయాంలోనే గుర్తించి రూ.13.19 కోట్ల జరిమానా విధించారు. కానీ నేటికీ పైసా చెల్లించలేదు. 2024 సెప్టెంబర్ ఏడో తేదీన జరిమానాపై పునఃపరిశీలన జరపాలని కూటమి సర్కార్ గనుల శాఖను ఆదేశించింది. ఈ మొత్తం రూపుమాపేలా కూటమి నాయకుడు చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఇతనొక్కడే కాదు..మరికొందరు కూటమి నాయకులు అధికారం అండతో రెచ్చిపోతూ దోపిడీ కొనసాగిస్తున్నారు. జిల్లాలోని కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాలు ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి. ఇక్కడ విలువైన ఐరన్‌ఓర్ పరిశ్రమలతో పాటు స్టోన్ క్వారీలు, క్రషర్ల నిర్వహణ ఎక్కువ. ఈ రెండు మండలాల్లోనే సుమారు 52 క్వారీలు, స్టోన్ క్రషర్లు ఉన్నాయి. వీటిలో మెజార్టీ కూటమి నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. క్వారీ లీజుదారులు విస్తీర్ణం కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా తవ్వకాలు జరిపి.. తక్కువ మొత్తం ఖనిజానికి రాయల్టీ చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. క్రషర్లలో స్టోన్‌గా మార్చి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, సండూరు, తోరణగల్లు, జిందాల్ తదితర ప్రాంతాలకు టిప్పర్లలో తరలిస్తున్నారు.
నిబంధనలకు పాతర!
కంకర క్వారీల్లో నిబంధనల ప్రకారం కంప్రెషర్‌తో గరిష్టంగా 20 అడుగులు మాత్రమే డ్రిల్లింగ్ చేయాలి. లైసెన్సు, అనుభవం ఉన్న వ్యక్తి పర్యవేక్షణలోనే బ్లాస్టింగ్ జరపాలి. అయితే..చాలా క్వారీల్లో వంద అడుగుల మేర రంధ్రాలు వేస్తూ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రాళ్లు, దుమ్ము ఎగిరిపడి పొలాల్లోకి చేరడంతో రైతులు పంటలు నష్టపోతున్నారు.
నిబంధనలు పాటించాలి
క్వారీలు, క్రషర్ల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి. రాయల్టీ చెల్లించాకే కంకర తరలించాలి. పరిమితికి మించి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు చేపడతాం. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాయల్టీ అధికారులతో సంయుక్త తనిఖీలు జరిపి అక్రమాలుంటే చర్యలు చేపడతాం.
– శ్రీనివాసులు, మునివేలు,
డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ తహసీల్దార్లు
క్వారీలు, స్టోన్ క్రషర్ల నిర్వహణలో నిబంధనలకు నీళ్లు


